Central Election Commission Team Andhra Pradesh Visit: కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం విజయవాడకు చేరుకున్నారు. దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చారు. విమానాశ్రయంలో సీఈసీ బృందానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ జాషువా, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సీఈసీ బృందం నేటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 సహా ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా సమీక్షించనుంది. ఈ మేరకు 9, 10 తేదీల్లో భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహా, ఎన్నికల కమిషనర్లు విజయవాడలో రాజకీయ ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు.
9 తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ సహా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ప్రతినిధులతో సమావేశం కానున్న సీఈసీ వారి నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలపై చర్చించనున్నారు.
అనంతరం 2024 ఓటర్ల తుది జాబితాతో పాటు ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సమావేశం కానున్నారు. జనవరి 10వ తేదీన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్, సీఏపీఎఫ్ నోడల్ ఆఫీసర్ తదితరులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సీఈసీ సమావేశం కానున్నారు. అనంతరం సీఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.