హంద్రీనీవా సుజలస్రవంతి పథకంలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన 3 రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు. చెన్నేకొత్తపల్లిలోని వెంకటాపురం పైలాన్ వద్ద జరిగిన కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఇంఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు 2018 జనవరి 24న జీవో మాత్రమే ఇచ్చి పనులు చేయలేదని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3 రిజర్వాయర్ల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కెపాసిటీని మరో 3.3 టీఎంసీలు పెంచి అదనంగా మరో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్టు వివరించారు. గత ప్రభుత్వం రూ.803 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించిందని.. మూడేళ్లు దాటినా ప్రస్తుతం అదే అంచనా వ్యయంతో మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో లంచాలను కట్టడి చేస్తున్నామని చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.
90 రోజుల్లో 5 జలాశయాల్లో 7.21 టీఎంసీల నీరు నింపుతామని సీఎం జగన్ చెప్పారు. ప్రస్తుతం నిర్మిస్తోన్న 3 రిజర్వాయర్ల వల్ల 75 వేల ఎకరాలకు సాగునీరు, పలు ప్రాంతాలకు తాగునీరు అందుతుందని వివరించారు. బెలుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, రామగిరి మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రస్తుతం 3 రిజర్వాయర్ల నిర్మాణం కోసం 5171 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్న జగన్... జీడిపల్లి జలాశయం నుంచి ఎగువపెన్నా జలాశయం వరకు 53.45 కి.మీ ప్రధాన కాలువ, 4 ఎత్తిపోతల పథకాలు, 110 కాంక్రీట్ కట్టడాలు చేస్తామన్నారు.