చంద్రబాబుపై కన్నా లేఖాస్త్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో కన్నా తీవ్ర విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ దయాదాక్షిణ్యాల వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. ఆర్థిక నేరగాళ్లకు, పన్ను ఎగవేతదార్లకు అండగా ఉండేందుకే రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టేందుకు అనుమతి నిరాకరించారని ఆరోపించారు. చంద్రబాబుకు కావాల్సింది సూర్యోదయం కాదని... పుత్రోదయం మాత్రమేనని ఆ లేఖలో వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్లను తెదేపాలోకి చేర్చుకోవడం తప్ప... రాష్ట్రాభివృద్ధికి చేసిందేమి లేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు.నరేంద్ర మోదీ ఈ దేశ సంపదకు నిజమైన కాపలాదారుగా లేఖలో అభివర్ణించిన కన్నా... చంద్రబాబు అవినీతిపరుడుని ఆరోపించారు. యూ టర్న్లే కాక.. రాంగ్ టర్న్ తీసుకోవడంలోనూ తెదేపా అధినేత నిష్ణాతులని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడేందుకే.. ప్రతి సోమవారం పోలవరం పేరుతో హడావుడి చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు తెదేపా స్టిక్కర్లు వేసుకున్నది.. ప్రచారం చేసుకుంటున్నది వాస్తవం కాదా అని లేఖలో ప్రశ్నించారు. వైకాపాతో తెదేపాకు ఉన్న సమస్యను జాతీయ సమస్యగా చేసి... మోదీని నిందించటం మానుకోవాలని సూచించారు.