Anganwadis Agitation in Andhra Pradesh: పక్షం రోజులుగా శాంతియుతంగా నిరసన తెలిపిన అంగన్వాడీలు, ఒక్కసారిగా జూలు విదిల్చారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లు ముట్టడించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఆందోళనకు దిగారు. కొన్నిచోట్ల పోలీసులు అంగన్వాడీలను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ర్యాలీగా ఇళ్ల వద్దకు వెళ్లిన అంగన్వాడీలు అక్కడే బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. పలుచోట్ల అంగన్వాడీలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 16 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు సమ్మెను మరింత ఉద్ధృతం చేశారు. నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. మంత్రి ఇంట్లో లేకపోవడంతో అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. నెల్లూరు జిల్లా అంగన్వాడీల ఆందోళనలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మకూరులో నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా అంగన్వాడీ కార్యకర్త వనమ్మ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
అంగన్వాడీల అరెస్టు జగన్ నియంతృత్వానికి నిదర్శనం: లోకేశ్
ఒంగోలులో కలెక్టరేట్ నుంచి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసం వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. బాలినేని నివాసంలోకి వెళ్తుండగా పోలీసులు ఆంగన్వాడీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మంత్రి సురేష్, మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఇళ్లను అంగన్వాడీలు ముట్టడించారు. మంత్రి సురేశ్ ఇంట్లో లేకపోవడంతో ఇంటి గేటుకు వినతిపత్రం కట్టి వెళ్లి పోయారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో అంగన్వాడీల ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది. అనంతపురం శ్రీలక్ష్మినగర్‌లోని శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇంటి వద్ద అంగన్వాడీలు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వినతిపత్రం తీసుకోవాలని అంగన్వాడీలు పట్టుపట్టారు. ఎమ్మెల్యే బయటకు రాకపోవడంతో అంగన్వాడీలు రోడ్డుమీదే కూర్చుని వెంట తెచ్చుకున్న భోజనం తిన్నారు. ఆ తర్వాత ఎమ్మల్యే ఇంటి ప్రహరీ గోడకు వినతిపత్రం అతికించి నినాదాలు చేశారు.
అంగన్వాడీతో ప్రభుత్వం మళ్లీ చర్చలు - ఆ రెండు డిమాండ్లపై కార్యకర్తల పట్టు
అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటి ఎదుటా అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. అంగన్వాడీల నుంచి వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. అనంతపురం నగరంలోని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు.
కళ్యాణదుర్గంలో స్త్రీ, సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన అంగన్వాడీలు ర్యాలీగా మంత్రి ఇంటి ముట్టడికి యత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. అనంతరం మంత్రి ఇంటిముందు బైఠాయించి అంగన్వాడీలు నిరసన తెలిపారు.
సీఎం జగన్‌కు కనపడదా, వినపడదా - పన్నెండో రోజూ కదం తొక్కిన అంగన్వాడీలు
జిల్లాలోని ఉరవకొండలోన విడపనకల్లు, కూడేరు, బెలుగుప్ప, వజ్రకరూరు, ఉరవకొండ మండలాల అంగన్వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రతినిధికి వినతిపత్రం అందజేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో మాజీమంత్రి శంకరనారాయణకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన అంగన్వాడీలు ఎమ్మెల్యే ఇంటి ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
కనీస వేతనం 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అంజాద్ బాషా లేకపోవడంతో రెండు గంటల పాటు అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. రాచమల్లు ఇంట్లో లేకపోవటంతో అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించారు.