విపత్తుల వేళ ప్రజలకు అండగా 'ఆపదమిత్ర' కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవిస్తుంటాయి. 1977లో వచ్చిన ఉప్పెన వేలమందిని పొట్టనబెట్టుకుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆయా గ్రామాల్లోని యువతకే సహాయక చర్యలపై ఉచిత శిక్షణ అందజేస్తోంది. ఆపదమిత్ర పేరిట మొదటి విడతగా కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో గ్రామానికి ఒకరు చొప్పున 30 మందిని ఎంపిక చేసింది.
12 రోజుల పాటు శిక్షణ
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ అధికారులు కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని మత్య్సకారులు ప్రత్యేక శిక్షణ అందించారు. గత నెలలో 12 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో వీరికి ఒక్కొక్కరికి రోజుకు రూ.300 చొప్పున భృతి, రవాణా ఛార్జీల కింద మరో రూ.100 ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అధికారులు ఇవాళ ప్రత్యేక కిట్‌ను అందించారు. రూ.6వేలు విలువైన 16 వస్తువులను పంపిణీ చేశారు.
ఈ అంశాల్లోనే శిక్షణ
- విపత్తులను మొదటిగా అంచనావేసి గ్రామాల్లోని ప్రజలను సురక్షిత భవనంలోకి వెళ్లేలా చేయటం
- ఎవరైనా గాయపడితే ప్రథమ చికిత్స అందించటం
- నీటిలో మునిగిపోయే వారికి లైఫ్ జాకెట్ అందించి కాపాడటం
- విపత్తు తరువాత ప్రజలకు ఎలాంటి విషయాలు తెలియజేయాలి?
- నదుల్లో ఎక్కడైనా పడవ మునిగి పోయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు
- ఉన్నతాధికారులకు సమాచారంతెలియజేయటం వంటి అంశాలపై ఆపద మిత్రులకు శిక్షణ ఇచ్చారు.
జిల్లాలో మొత్తం 200 మంది ఆపదమిత్రలకు శిక్షణ ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో నాగాయలంక మండలంతో సహా జిల్లా వ్యాప్తంగా 90 మందికి ఈ శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. త్వరలోనే మరో 110 మందికి తర్ఫీదు ఇస్తామని వెల్లడించారు.