Nimmala Ramanaidu sensational comments on CM Jagan: రాష్ట్ర ప్రభుత్వానికి కోడి పందేలు, జూదం, గుండాటాలపై ఉన్న శ్రద్ధ, రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లపై లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్టి వ్యవహరిస్తున్న తీరుపై ఆయన పలు విమర్శనాస్త్రాలు సంధించారు. 2020-21లో 47లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని, 2022-23లో 37 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితం చేయడం రైతుల్ని నట్టేటముంచడమేనని వ్యాఖ్యానించారు.
అనంతరం రైతుల వద్ద ధాన్యం నిల్వలుంటే, ప్రభుత్వం అర్థంతరంగా కొనుగోళ్లను నిలిపేయడమేంటని నిలదీశారు. యంత్రాల ద్వారా కోసిన ధాన్యంలో కచ్చితంగా తేమ ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియకపోవటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తేమశాతం పేరుతో జగన్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయంపైనే విరక్తి పుట్టించేలా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ధాన్యం మొత్తం ప్రభుత్వం కొనాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్నదాతలకు న్యాయం చేయకుంటే.. ‘రైతుకోసం-తెలుగుదేశం’ అనే కార్యక్రమం చేపట్టి.. జగన్ రెడ్డికి దిమ్మతిరిగేలా చేస్తామని నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.