కోనసీమ జిల్లా కొమరగిరిపట్నం.. ఈ నెల 2న ఊరంతా నిద్రపోతోంది.. ఓ తాటాకు ఇల్లు ఉన్నట్టుండి భగ్గుమంది.. ఇంట్లో ఉన్న జ్యోతి, ఆమెతల్లి మంగాదేవి కాలిబూడిదయ్యారు. ఇంతకీ ఆరోజు రాత్రి ఏం జరిగింది ? ఉన్నట్లుండి పూరిల్లు ఎందుకు దగ్ధమైంది ? ఇది ప్రమాదమా ? లేక ఎవరైనా నిప్పంటించారా ? మొదట్నుంచీ అనేక ప్రశ్నలతో అనుమానాస్పదంగా ఉన్న ఈ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరగిరిపట్నానికి చెందిన జ్యోతి, అదే గ్రామానికి చెందిన సురేశ్ ఈ ఏడాది మే 10న ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతకుముందే సురేశ్‌కు.. అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి తర్వాత సురేశ్ నాగలక్ష్మిని దూరంపెట్టాడు. నాగలక్ష్మి రగిలిపోయింది. ఎలాగైనా.. మళ్లీ సురేశ్‌ను వశపరుచుకోవాలని అనేక ఎత్తులు వేసింది. ఇందుకోసం తన ఇద్దరుకుమార్తెలనూ వాడుకుంది. తొలుత సురేశ్ కాపురంలో కలతలు సృష్టించాలని పథకం వేసింది. జ్యోతికి వేరొకరితో సంబంధం ఉందని అనుమానం రేకెత్తించేలా.. వేరే పేర్లతో కొన్ని ప్రేమ లేఖలు పంపింది. సురేశ్ అవేమీ నమ్మకపోవడంతో నాగలక్ష్మి.. మరో ప్లాన్ వేసింది. జ్యోతిని చంపేస్తేగానీ.. సురేశ్ తన వద్దకు రాడనే నిర్ణయానికొచ్చింది. ఇందుకోసం అత్యంత అమానవీయ పథకం వేసింది.