Godavari: గోదావరి తీర ప్రాంతాల్ని వరద ముంచెత్తుతోంది. శనివారం ఉదయం నుంచి గంటగంటకూ గ్రామాల్లో ముంపు ప్రాంతం పెరుగుతోంది. 6 జిల్లాల్లోని 62 మండలాల్లో 324 గ్రామాలు వరద ప్రభావితమయ్యాయి. మరో 191 గ్రామాలకు వరద చేరింది. శనివారం రాత్రి 11 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీవద్ద 25.59 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. బ్యారేజీలో 21.6 అడుగుల నీటి మట్టం దాటింది. అంతే స్థాయిలో కిందకు విడుదలవుతోంది. దీంతో పలుచోట్ల వంతెనలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. రాజమహేంద్రవరం- కొవ్వూరు మధ్య నదిపై ఉన్న రోడ్‌కం రైలు వంతెన మీదుగా బస్సులు, లారీలవంటి భారీ వాహనాల రాకపోకలను శనివారం రాత్రి నుంచి నిలిపేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లకే అనుమతిస్తున్నారు. యానాంలో బాలయోగి వారధి పక్కన జాతీయ రహదారి ఎత్తుకు నీరు చేరువైంది. ఆదివారం నుంచి వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని, పూర్తి స్థాయిలో తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
* గోదావరి వరద భద్రాచలం వద్ద్ద 71.30 అడుగులకు చేరి క్రమేపీ తగ్గుతోందని సీడబ్ల్యూసీ ప్రకటించింది. క్షేత్రస్థాయిలో ఉద్ధృతి చూస్తే 1986నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పట్లో మునిగిన గ్రామాలన్నీ ప్రస్తుతం ముంపునకు గురయ్యాయి. అప్పట్లో 75.6 అడుగులు నమోదైంది. 1990లో 70.8 అడుగుల వరద వచ్చింది. అప్పుడు ఇంత తీవ్రత లేదు. వరదల ప్రభావం ఏలూరు, అల్లూరి జిల్లాల్లోని విలీన మండలాలపైనే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ జిల్లాల్లోని 6మండలాల్లో పూర్తిగా నష్టం వాటిల్లింది.
* శనివారం రాత్రి 8గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. శ్రీశైలానికి జూరాల నుంచి 1,52,368 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 27 గేట్ల ద్వారా 1,61,988 క్యూసెక్కులు వస్తోంది.
వరద బాధిత కుటుంబాలకు సత్వరం రేషన్: సీఎం
ఈనాడు, అమరావతి: గోదావరి వరద బాధిత కుటుంబాలకు యుద్ధప్రాతిపదికన రేషన్ అందజేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ‘ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు అందించాలి. కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ.వెయ్యి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగా అందించాలి. ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదు. సహాయ బృందాలను వినియోగించుకోవాలి. మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలి. సేవలు నాణ్యంగా ఉండాలి. గంటగంటకూ వరద పరిస్థితిపై నివేదిక అందించాలి’ అని ఆదేశించారు. మరోవైపు ఆయా జిల్లాల్లో పరిస్థితిని మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, అధికారులు సమీక్షించారు.