ఎదుర్లంక వారధిపై ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి - కోనసీమ రోడ్డు ప్రమాదం
17:04 April 17
కోనసీమ జిల్లాలో విషాదం
కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుమార్తె సొంతింటి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వారధిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన గుబ్బల సుబ్రహ్మణ్యం (49), భార్య మంగాదేవి (44), మనుమడు యశ్వంత్ శివకార్తీక్ (6) ద్విచక్ర వాహనంపై ద్రాక్షారామలోని కుమార్తె సొంతింటి శంకుస్థాపనకి వెళ్లారు. అనంతరం మనమరాలు తేజశ్రీలక్ష్మి(4)తో కలిసి నలుగురు ఆదివారం మధ్యాహ్నం చెయ్యేరు తిరుగు ప్రయాణమయ్యారు. ఎదుర్లంక నుంచి యానాం వైపు వెళుతున్న ఇసుక లారీ ముందు వెళుతున్న మరో వాహనాన్ని తప్పించే క్రమంలో ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వీరిని ఢీకొట్టింది. దీంతో సుబ్రహ్మణ్యం, మంగాదేవి, యశ్వంత్ శివకార్తీక్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తేజశ్రీలక్ష్మిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు, ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని ఎస్సై రాజేష్ తెలిపారు.
ఇదీ చదవండి: ప్రముఖుడి విల్లాలో మెకానిక్ మృతి.. గుట్టుచప్పుడు కాకుండా రాజీ ప్రయత్నాలు!