Amalapuram incident: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మే 24వ తేదీన జరిగిన విధ్వంసకర సంఘటనలో ఇప్పటివరకు నాలుగు దఫాలుగా మొత్తం 71 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరికొంత మంది అనుమానితుల కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డితో పాటు ఎస్పీలు సిద్ధార్థ కౌశల్, రవీంద్రనాథ్ బాబు క్షేత్రస్థాయిలో అమలాపురంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
నిందితుల కోసం 7 బృందాల వేట: గత నెల 24న జరిగిన విధ్వంసంలో మంత్రి పినిపే విశ్వరూప్ నివాసాలు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసం, మూడు ఆర్టీసీ బస్సులు దగ్ధమయ్యాయి. అమలాపురంలోని శుభకలశం మొదలుకొని గడియార స్తంభం నల్ల వంతెన, కలెక్టరేట్ ఎర్ర వంతెన, మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాస దగ్ధం వరకు పాల్గొన్న ఆందోళనకారులపై పోలీసులు.. సాంకేతిక సహకారంతో దర్యాప్తు చేస్తూ నిందితులను అరెస్టు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 7 బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.