Life Threat to ZPTC Family by MLA: కాకినాడ జిల్లా ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని ప్రత్తిపాడు జడ్పీటీసీ సభ్యురాలు బెహరా రాజరాజేశ్వరి బుధవారం ఒక వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే నుంచి తన కుటుంబానికి, తన అనుచరులకు రక్షణ కల్పించాలంటూ ఆమె వీడియోలో విజ్ఙప్తి చేశారు. గత ఏడాది కాలంగా ఎమ్మెల్యే తమను వేధింపులకు గురి చేస్తున్నారని, ఆమె భర్త దొరబాబుతో పాటు అనుచరులపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల్లోకి వెళితే తమను కొట్టాలని పార్టీ శ్రేణులకు హుకుం జారీ చేశారని ఆమె అన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమానికి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లగా.. తమపై విచక్షణా రహితంగా దాడి చేసి కేసులు నమోదు చేశారని ఆమె తెలిపారు. కాగా ఈ విషయాన్ని ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు. తన భర్తతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపిన ఆమె.. ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ నుంచి తమకు రక్షణ కల్పించాలని అధికారులను వేడుకున్నారు. ఆమె విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రత్తిపాడులో వైసీపీ అసమ్మతి, ఎమ్మెల్యేతో విభేదాలు బహిర్గతమవ్వగా.. తాజాగా మరో వీడియో వెలుగులోకి రావటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Life Threat: 'ఎమ్మెల్యే వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి..'
Life Threat to ZPTC Family by MLA: ఎమ్మెల్యే వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ జడ్పీటీసీ సభ్యురాలు ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా తమకు రక్షణ కల్పించాలని ఆమె అధికారులను కోరారు. ఈ సంఘటన కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో వెలుగులోకి వచ్చింది.
"అందరికీ నమస్కారం.. నా పేరు బెహరా రాజరాజేశ్వరి. నేను ప్రత్తిపాడులో జడ్పీటీసీ సభ్యురాలిని. మా ఎమ్మెల్యే పూర్ణ చంద్ర ప్రసాద్ నుంచి మాకు ప్రాణ హాని ఉంది. గత ఏడాది కాలంగా ఎమ్మెల్యే మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. నా భర్తపై, మా అనుచరులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. మేము ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని ఈడ్చి కొట్టమని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పూర్ణ చంద్ర హుకుం జారీ చేశారు. పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమానికి మేము మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లగా వారు మాపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేస్తూ.. ఎంతో విలువను ఇస్తూ.. రాష్ట్రాన్ని పరిపాలిస్తుండగా.. మా శాసనసభ్యులు మాత్రం మాతో ఇలా ప్రవర్తిస్తున్నారు. దీంతో మేము బయటకు వెళ్లేందుకు కూడా చాలా భయపడుతున్నాము. మా కుటుంబానికి రక్షణ కల్పించాలని మేము కోరుతున్నాము. నేను ఈ విషయాన్ని ఇప్పటికే అధిష్టానికి తెలియజేశాను. వారు మా సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు." - బెహరా రాజరాజేశ్వరి, ప్రత్తిపాడు జెడ్పీటీసీ
ఇవీ చదవండి: