Tallarevu farmers fire on government officers: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల అన్నదాతలకు తిప్పలు తప్పటం లేదు. తొలకరి పంట చేతికి వచ్చే సమయానికి ఊహించని రీతిలో అకాల వర్షాలు పడి, పంటలన్నీ దెబ్బతినడంతో.. ఏం చేయాలో అర్థంకాక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు కోతలు కోసి పొలంలోని పంటను కుప్పలుగా చేసి, ధాన్యం రాశిగా ఏర్పాటు చేస్తే వర్షాల కారణంగా ఆ రాశిలోని వడ్లన్నీ మొలకలుగా మారాయి. వర్షపు నీటిని చేలకు మళ్లించి పంటను కాపాడుకోవడానికి ఏ చిన్న అవకాశం లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం రైతులను రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలానికి చెందిన పడవల, జి వేమవరం, మల్లవరం, పత్తిగొంది ప్రాంతాలలోని శివారు భూముల్లో రెండో పంట కోతలను రైతులు ప్రారంభించారు. గడచిన వారం రోజుల్లో కురిసిన అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. ఇప్పటివరకూ ప్రజాప్రతినిధులు గానీ, వ్యవసాయ శాఖ సిబ్బంది గానీ.. రైతు భరోసా కేంద్రాల సిబ్బంది గానీ పొలాల వద్దకు వచ్చి పరిశీలించలేదని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో పొలాన్ని కౌలుకు తీసుకున్న రైతు.. యజమానికి కౌలు చెల్లించక నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కౌలు రైతుకు సంబంధించి ఈ క్రాఫ్ట్ కూడా నమోదు కాలేదని.. క్షేత్రస్థాయిలో సిబ్బంది స్పందించడం లేదని.. అధికారులే మమ్మల్ని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులు మాట్లాడుతూ.. తొలకరి పంట పూర్తిగా పోయింది. రెండో పంటను కోద్దామంటే కూలీల కొరత. ఇంతలోనే అకాల వర్షాలు పడి చేలోనే మొలకలు వచ్చాయి. ఈ ధాన్యాన్ని ఏం చేయాలో అర్థం కావటం లేదు. అప్పులు చేసి పంటను పండిస్తే అకాల వర్షాలు కురిసి పంటంతా దెబ్బతింది. అధికారులు, ప్రభుత్వం ఆదుకోకపోతే మాకు చావే శరణ్యం. వర్షం వల్ల రాశులుగా పోసిన ధాన్యం మొలకొచ్చింది. మిల్లులకు తరలించాలంటే ప్రభుత్వం అనేక నిబంధనలు పెడుతుంది. ఆన్లైన్ విధానంలోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి. వ్యవసాయం చేయడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం ప్రతి గింజ కొంటామంటున్నారు గానీ.. రైతు దగ్గరకు వచ్చి దాని పరిస్థితిపై ఆరా తీయటం లేదు'' అని వారి గోడును వెల్లబోసుకున్నారు.