YSRCP ignored TDP started development works: అధికారం అంటే ఆజమాయిషీ చేయడం కాదు. ప్రజల పట్ల మమకారం చూపడం. ప్రజలకు మంచి చేయడం కోసం నాలుగడుగులు ముందుకు వేయడం.. ఇవి సీఎం జగన్ ప్రతిసమావేశంలోనూ, సభల్లో వల్లె వేసే మాటలు. కానీ ఆచరణ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులైతే ఇక అంతే సంగతులు. పైసా నిధులు కూడా విడుదల కావు. వైసీపీ ప్రభుత్వ కక్షపూరిత ధోరణితో ఇప్పటికే పలు ప్రాజెక్టులు అటకెక్కగా.. కొన్ని అసంపూర్తిగా నిలిచిపోయాయి.
'ఎక్కడ కూడా లంచాలకు తావు లేకుండా.. ఎక్కడా వివక్షకు చోటివ్వకుండా. ఎటువంటి మతం, కులం, ప్రాంతం చూడకుండా.. చివరకి రాజకీయ పార్టీ అన్న ప్రస్థావన కూడా చూడకుండా. మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు. అర్హత ఉంటే కచ్చితంగా అందించాలి. ఏ ఒక్కరూ మిస్ కాకుడదు అని తపన తాపత్రయంతో.. అడుగులు వేస్తున్న పాలనే.. నవరత్నాల పాలన.' అని ఆగస్టు 24, 2023లో మన ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న నీతి వాక్యాలు ఇవి.
సంక్షేమ, అభివృద్ధి పనుల్లో ఎంతో విశాల హృదయంతో వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి జగన్.. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులంటే చాలు... భగ్గుమంటున్నారు. అవి ప్రజాప్రయోగకరమైనా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రజల దాహార్తి తీర్చే తాగునీటి పథకాలైనా.. అందరికీ ఉపయోగపడే రహదారులైనా.. గత ప్రభుత్వం ప్రారంభించినవైతే చాలు నిధులివ్వకుండా నిలిచిపోయేలా చేస్తున్నారు. పుర, నగరపాలక సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కోసం టీడీపీ హయాంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులను అటకెక్కించారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, మచిలీపట్నం, నెల్లూరు తదితర నగరాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన అనేక ప్రాజెక్టులు వైసీపీ ప్రభుత్వ నిర్వాకానికి అద్దం పడుతున్నాయి.
Achenna on Projects: 'జలవనరుల ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన రాయలసీమ ద్రోహి.. జగన్ రెడ్డి'
గుంటూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి టీడీపీ హయాంలో నాలుగు దశల్లో దాదాపు 14 కిలోమీటర్ల మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఒకటి, రెండు, నాలుగు దశల పనులు పూర్తయ్యాయి. మూడో దశలోని స్వర్ణభారతి నగర్ నుంచి పెదపలకలూరు వరకు 4.25 కిలోమీటర్లు రహదారి నిర్మాణ పనులపై ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.
ఈ రోడ్డు పూర్తయితే సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట నుంచి వచ్చే వాహనాలు గుంటూరు నగరంలోకి రాకుండానే విజయవాడ, రాజధాని అమరావతి ప్రాంతానికి నేరుగా వెళ్లే వీలుంటుంది. మచిలీపట్నంలో 16.76 కోట్ల రూపాయలతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులకు టీడీపీ హయాంలో 2018 మేలో శంకుస్థాపన చేశారు. దాదాపు 50 శాతం పనులు పూర్తయ్యాక వచ్చిన కొత్త ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి.