జగనన్న మార్క్ మోసం- నా ఎస్సీ, నా ఎస్టీ అంటూనే సంక్షేమాలకు తూట్లు YSRCP Govt Scam in SC and ST Schemes:సభ ఏదైనా జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ అనే డైలాగ్ కొట్టకుండా ఉండరు ఈ తియ్యటి మాటల వెనకున్న ద్రోహం విలువెంతో తెలుసా? దాదాపు 29 వేల కోట్లు! నోరెళ్లబెట్టకండి. మీరు విన్నది నిజమే? ఇది జగన్ మార్క్ మోసం! నవరత్నాలు ఇస్తున్నారు కదా అంటారా? అవి కేవలం ఎస్సీ, ఎస్టీలకే ఇస్తున్నారా? ఓసీలు, బీసీ వర్గాలకు ఇవ్వడం లేదా? అందరికీ ఇస్తున్నప్పుడు మరి దళితులకు జగన్ ఉద్ధరించిందేంటి? ప్రత్యేకించి తెచ్చిన పథకం ఒక్కటైనా ఉందా? లేనే లేదు.! నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ మైకుల ముందు ప్రేమ ఒలకబోస్తూనే ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు పాతరేశారు. ఎస్సీ, ఎస్టీల కోసమే గత ప్రభుత్వాలు అమలుచేసిన ప్రత్యేక పథకాలను ఎత్తేశారు.
ఎస్సీ, ఎస్టీలపై జగన్ స్వీట్ మాటలు - పథకాలు కట్- ఉపాధిని దూరం చేసి కట్టు బానిసలుగా మార్చాలనే కుట్ర!
జగన్ మార్క్ మోసం:ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలను ఆర్థికంగా, సామాజికంగా విద్య, ఉపాధి పరంగా ఇతర వర్గాలతో సమానంగా తీసుకురావడమే ధ్యేయంగా గతంలో ఉపప్రణాళిక చట్టం తెచ్చారు. జనాభా దామాషా ప్రకారం ఆయా వర్గాల అభ్యున్నతికి నిధులు కేటాయించాలన్నది చట్టం ఉద్దేశం. గత ప్రభుత్వాలు ఆ మేరకు నిధులు కేటాయించాయి. కానీ వైఎస్సార్సీపీ సర్కారు ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక స్ఫూర్తికే తూట్లు పొడిచింది. ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు ఉన్నతి పథకం కింద ఉపప్రణాళిక నిధుల్ని కేటాయించాలి.
కానీ నాలుగున్నరేళ్లుగా ఒక్క రూపాయీ కేటాయించలేదు. దళిత, గిరిజన కాలనీలు, తండాల్లో రహదారులు, తాగునీరు, అంతర్గత మురుగు కాలువల వంటి మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. గత ప్రభుత్వాల హయాంలో వీటికి కేటాయించిన ఉపప్రణాళిక నిధులన్నింటినీ ఇప్పుడు నవరత్నాలకు మళ్లిస్తున్నారు. అందులోనే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల సంఖ్య వారికి కేటాయించిన నిధుల్ని తీసి ఉపప్రణాళిక నిధుల కింద చూపిస్తూ జగన్ మార్క్ మోసం చేస్తున్నారు.
100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన వ్యక్తి జగన్ : లోకేశ్
ఎస్సీలకు కేటాయించాల్సిన నిధులు:మాటలతో బడుగుల్ని జగన్ ఎంత మభ్యపెట్టాలనుకున్నా బడ్జెట్ అంకెలు ఇన్నాళ్లూ ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన వంచనను బయటపెట్టేశాయి. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 16.4% ఉన్నారు. ఏటా బడ్జెట్‌లో ఆ మేరకు ఉపప్రణాళిక నిధులు కేటాయించాలి. కానీ గత నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ సర్కార్ కోతేస్తూనే ఉంది. 2019-20లో 11%, 2020-21లో 11.9%, 2021-22లో 13.8%, 2022-23లో 12.1% మేర మాత్రమే కేటాయించింది. జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు 89 వేల 706 కోట్లు కేటాయించాల్సి ఉంటే 66 వేల 656 కోట్లే కేటాయించారు. అంటే 23 వేల 50 కోట్ల రూపాయలు గండి పడింది.
ఎస్టీ లకు కేటాయించాల్సిన నిధులు:ఇక ఎస్టీల విషయానికొస్తే రాష్ట్రంలో ఆ సామాజివర్గ జనాభా 5.3%శాతం ఉంది. 2019-20లో 3.7%, 2020-21లో 3.9%, 2021-22లో 4.9%, 2022-23లో 4% నిధులు మాత్రమే కేటాయించారు. ఎస్టీలకు నాలుగేళ్లలో 28 వేల 990 కోట్లు కేటాయించాల్సి ఉంటే 22వేల 443 కోట్లతో సరిపెట్టారు. అంటే 6 వేల 547 కోట్ల మేర గండికొట్టారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.29 వేల కోట్లు దూరం చేశారు. ఇది దళిత, గిరిజనులకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ఎన్నడూ చేయని దగా.
CM Jagan cheating SCs: 'మీరెలా దళిత బంధువు జగన్..?' ఎస్సీల పథకాలకు పాతర.. నాలుగేళ్లలో ఒక్క కుటుంబానికీ దక్కని లబ్ధి
ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేసిన నిధుల్లోనూ 90 శాతానికిపైగా నవరత్న పథకాలకే వినియోగించారు. చివరకు అందరికీ ఇచ్చే పింఛన్లు, ఉపకారవేతనాల కింద ఇచ్చే సాయానికీ ఉపప్రణాళిక నిధుల్నే వినియోగించారు. జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాల కింద చిన్నారులకిచ్చే గుడ్డు, మధ్యాహ్న భోజనం లెక్కల్ని కూడా ఇందులోనే చూపించారు. చట్టప్రకారం ఉపప్రణాళిక నిధుల్ని ఏ శాఖ ఎంత ఖర్చు చేసింది? వేటికి వినియోగించింది అనే వివరాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అలా చేస్తే జగన్ నైజం బయటపడుతుందని గ్రహించిన వైఎస్సార్సీపీ సర్కార్ ఆ వివరాల్ని ఎక్కడా బహిర్గతం చేయడంలేదు. పైగా కులగణన చేస్తామంటూ కొత్త నాటకం మొదలుపెట్టింది.