హైకోర్టు తీర్పును అడ్వకేట్ జనరల్ వ్యాఖ్యానించడం దారుణమని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్ కుమార్ స్వయంగా పునరుద్ధరించుకోలేరంటూ ఏజీ ఎస్. శ్రీరామ్మీడియా సమావేశంలో మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. అడ్వకేట్ జనరల్ మీడియా సమావేశం పెట్టడం తన సుదీర్ఘ అనుభవంలో చూడలేదని యనమల అన్నారు. తీర్పుపై అప్పీల్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని.... ఇందుకు భిన్నంగా ఏజీ మీడియా సమావేశం పెట్టడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రభుత్వ దురుద్దేశాలను ఏజీ ద్వారా చెప్పించాలనే తాపత్రయం వెల్లడైందని దుయ్యబట్టారు.
'హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ ప్రెస్‌మీట్ ఎలా పెడతారు?'
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా రమేశ్ కుమార్ స్వయంగా పునరుద్ధరించుకోలేరంటూ అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్. శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను తెదేపా నేత యనమల తప్పుబట్టారు. హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ ప్రెస్‌మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు.
'హైకోర్టు తీర్పులో పేర్కొన్న 'స్టాండ్ రిస్టోర్డ్' పదాన్ని ప్రస్తావిస్తూనే ఏజీ వక్రభాష్యాలు చెప్పారు. ఆర్టికల్ 213(కె)1 ప్రకారం ఎస్‌ఈసీని నియమించేది గవర్నర్. ఆర్డినెన్స్ ద్వారా కొత్త ఎస్‌ఈసీని నియమించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఆర్డినెన్స్ నంబర్ 5/2020 రద్దైన క్షణం నుంచే రమేష్‌కుమార్ విధుల్లోకి వచ్చినట్లు. ఇవన్నీ ఏజీకి తెలియనివి కావు. అయినా హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ ప్రెస్‌మీట్ ఎలా పెడతారు? ఇది కోర్టు ధిక్కరణ కాదా..?' అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.