vice president: సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ప్రజల మధ్య విభేదాలు సృష్టించటం బాధాకరమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాటిబండ్ల సీతారామయ్య ముందుచూపుతో ఏర్పాటు చేసిన పాఠశాల ఎందరో సమర్థులను దేశానికి అందించిందన్నారు. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దని విద్య నిరుపయోగమని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. సమాజంలో రోజురోజుకూ విలువలు తగ్గుతున్నాయని, ప్రజల్ని కులం, మతం పేరుతో విడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభల్లోనే బూతులు, అసభ్య పదజాలం వాడటం దారుణమన్నారు. కులం, మతం, నేర ప్రవృత్తి, డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
సమాజం కోసం పాటుపడిన వారిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని తెలిపారు. అయితే కొందరు విద్యను వ్యాపారంగా చేసుకుని డబ్బు సంపాదిస్తున్నారని.. ఇది సరైన విధానం కాదన్నారు. దేశానికి నాయకత్వం వహించే సమర్థులను తయారు చేయటం కూడా విద్య లక్ష్యమని తెలిపారు. తాను ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా వేషధారణ మార్చలేదని సంప్రదాయ వస్త్రాలతో ఏ దేశానికి వెళ్లినా అందరూ గౌరవిస్తున్నారని తెలిపారు. మన సంప్రదాయాలను మనం పాటిస్తే.. ప్రపంచం మనం గౌరవిస్తుందని స్పష్టం చేశారు. మన మాతృభాషను గౌరవించుకోవాలని.. తనతో పాటు దేశ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతా మాతృభాషలో చదివినవాళ్లమేనని వెల్లడించారు.