Temperatures in AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు సెగలుకక్కుతున్నాడు. వాయవ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావానికి రాష్ట్రంలో మరోమారు తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావట్లేదు. ఒకవేళ బయటకు వచ్చినా.. గొడుగు వెంట బెట్టుకుని వస్తున్నారు. లేకుంటే స్కార్ఫ్, టవల్ వంటి వాటిని ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు వినియోగిస్తున్నారు.
మరో మూడు రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు..కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఈ నెల 18వ తేదీ వరకూ రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది. ప్రత్యేకించిఉత్తర, కోస్తాంధ్ర జిల్లాల్లోతీవ్ర ఉక్కపోత, వేడిమి పరిస్థితులు కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.. నాలుగు రోజుల క్రితమేనైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోని శ్రీ హరి కోట వరకూ విస్తరించినా పశ్చిమ తీరంలోని బిపర్ జోయ్ తుపాను కారణంగా ముందుకు కదలకపోవటంతో ప్రస్తుతం రాష్ట్రంలో వేడిమి పరిస్థితులు కొనసాగుతున్నాయి.