ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

100 రకాల వృక్ష జాతులతో 'థీమ్​ పార్క్​'

పార్కులంటే అందరికీ ఇష్టమే..సేద తీరేందుకు పార్కులను మించి మరో ప్రదేశం ఉండదు. అయితే కొందరు ఆహ్లాదం, ఆనందంతో పాటు అధ్యయనానికి కూడా ఉపయోగపడేలా ఓ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఫైకస్ జాతికి చెందిన వందకు పైగా మొక్కలు, వృక్షాలు.. ఒకేచోట కొలువుదీరేలా థీమ్​ పార్కును సిద్ధం చేస్తున్నారు.

park

By

Published : Jul 23, 2019, 7:13 PM IST

Updated : Jul 24, 2019, 7:01 AM IST

100 రకాల వృక్ష జాతులతో థీంపార్కు

ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కలు, చెట్లు.. రకరకాల ప్రాంతాల నుంచి సేకరించినవి. సాధారణంగా పార్కుల్లో చిన్న చిన్న మొక్కలను పెంచి సుందరంగా తీర్చిదిద్దుతారు. వాటికి భిన్నంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఈ థీమ్​ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. 100 రకాల వృక్ష జాతులను ఒకే దగ్గర పొందుపరుస్తున్నారు. శేషాచలం, కోరంగి, పాడేరు వంటి భిన్నమైన అటవీ ప్రాంతాలలో కనిపించే జాతులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పైకస్ డల్హౌసి, ఫైకస్ నెర్వోజా, ఫైకస్ వేరిగేటా, ఫైకస్ పామేట, ఫైకస్ హెడిరోఫిల్లా వంటి.. ప్రత్యేకమైన వృక్షాలూ వీటిలో ఉన్నాయి.

ఈ వృక్షాలను ఓ క్రమపద్ధతిలో పార్కులో ఏర్పాటు చేస్తున్నారు. బోన్సాయ్ మొక్కలతో మరో ప్రత్యేక విభాగం సిద్ధమవుతోంది. పార్కులో ప్రత్యేకంగా నడకబాటను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చేవారికి చిన్నపాటి వేడుక కోసం ఓపెన్‌ థియేటర్‌, ఒత్తిడి నివారణ కోసం ధ్యాన కేంద్రం, విభిన్నమైన రుచులు అందించే ఆహారశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటయ్యే ఓపెన్‌ జిమ్‌లలో ప్రకృతిని ఆస్వాదిస్తూ వ్యాయామాలు చేయొచ్చు.

మూడెకరాల స్థలంలో, సుమారు రెండున్నర కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సందర్శనకు వచ్చిన చిన్నా, పెద్దా అందరూ.. పార్కులో సరదాగా సేదతీరేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నామంటున్నారు. మరో రెండు నెలల్లో సకల హంగులతో పార్కు సిద్ధమవుతుందని, అందరూ ప్రకృతిని ఆస్వాదించవచ్చని అధికారులు అంటున్నారు.

Last Updated : Jul 24, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details