Theft of idols in ancient temples: గుంటూరు జిల్లాలోని పిరంగిపురం మండలంలో గుర్తు తెలియని దుండగులు పురాతన వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హౌస్ గణేష్ గ్రామం శివారు పొలాల్లో కొండపై ఆలయంలో ఈ వినాయకుడి రాతి విగ్రహం ఉంది. అయితే ఆ ఆలయంలో వినాయకుడి విగ్రం పగలగొట్టి ఉంది. ఈ విషయాన్ని స్థానికులు సోమవారం మధ్యాహ్నం గుర్తించారు. దీంతో ఎవరో గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. కాగా.. ఈ విగ్రహం 500 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు.
రాతి విగ్రహం పొట్ట భాగంలో గుప్త నిధులు ఉంటాయనే ఉద్దేశంతోనే దుండగులు ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు విగ్రహాన్ని పరిశీలించారు. కాగా.. వినాయకుడి విగ్రహ ధ్వంసంపై ఆందోళనకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో స్థానిక బీజేపీ నేతలు హౌస్ గణేష్పాడుకు బయల్దేరారు.