ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేట బైపాస్ పనులను తిరిగి బీఎస్పీఎల్​కు అప్పగింత

గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్ పనులను తిరిగి గతంలో వీటిని చేపట్టిన బీఎస్పీఎల్ కంపెనీకి కేటాయిస్తూ జాతీయ రహదారుల సంస్థ నిర్ణయం తీసుకుంది‌. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది మార్చిలో పనులు జాప్యం చేశారంటూ బీఎస్పీఎల్ కంపెనీకి బైపాస్ పనులను ఎన్ హెచ్ఏఐ రద్దు చేసింది. నేడు ఆ కంపెనీ విజప్తి మేరకు ఎన్ హెచ్ఏఐ తిరిగి పనులను అప్పగించింది.

Chilakaluripet bypass works
చిలకలూరిపేట బైపాస్ పనులు

By

Published : May 28, 2021, 3:51 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్ పనులు మళ్లీ బీఎస్పీఎల్ కంపెనీకి జాతీయ రహదారుల సంస్థ తిరిగి అప్పగించింది. గత ఏడాది మార్చిలో జైపాస్ పనులు జాప్యం జరిగాయంటూ టెండర్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం తిరిగి ఎన్‌హెచ్ఏఐ 16.384 కిమీ భార‌త‌మాల ప‌రియోజ్ఞ‌ ప్రాజెక్టులో భాగంగా తిరిగి టెండర్లను గత ఏడాది ఆగస్టు నెలలో పిలిచింది. అయితే పలుమార్లు టెండర్లు వాయిదా పడుతూ వచ్చాయి. పలు కంపెనీలు బిడ్‌లు దాఖ‌లు చేసుకున్నప్పటికీ ఇప్పటికే బీఎస్పీఎల్ కంపెనీ బైపాస్ రహదారికి సంబంధించి 16.384 కి.మీ పరిధిలో తిమ్మాపురం వద్ద నుంచి రామచంద్రాపురం అడ్డరోడ్డు వరకు 80 మీటర్ల పరిధిలో హద్దురాళ్లు ఏర్పాటు పనులు కూడా పూర్తి చేసింది. ఆ మార్గంలో భూమి చదును పనులు, ఎంత దూరం వరకు భూమిలోపల మట్టి తీసి నిర్మాణం చేపట్టాలనే ప‌ఠిష్ట‌త‌ పనులు కూడా గతంలోనే పూర్తిచేశారు. ఈ కారణంగా ఎన్‌హెచ్ఏఐకు బీఎస్పీఎల్ కంపెనీ విజ్ఞప్తి మేరకు తిరిగి ఆ కంపెనీకే పనులు కేటాయిస్తూ ఎన్‌హెచ్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సదరు కంపెనీ గతంలోనే బొప్పూడి వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటుచేసుకుంది. వాటన్నింటిని తిరిగి పునరుద్ధరించుకుని యంత్ర సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. 80 మీటర్ల పరిధిలో రహదారిపై జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా చేపట్టారు. ఓగేరు, కప్పగంజి.. వాగులపై తాత్కాలిక రహదారులు ఏర్పాటు చేసుకుని పనులు మొదలు పెట్టిన తర్వాత వేగవంతంగా చేసుకునేందుకు ముందస్తు ఏర్పాట్లను చేసుకుంటున్నారు.

మూడు చోట్ల ఫ్లైఓవర్లు

తిమ్మాపురం వద్ద నుంచి రామచంద్రాపురం అడ్డరోడ్డు వరకు నిర్మించనున్న చిలకలూరి పేట బైపాస్ రహదారిలో మూడు చోట్ల ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయనున్నారు. తిమ్మాపురం వద్ద, రామచంద్రాపురం వద్ద ఒక్కొక్కటి, చిలకలూరి పేట - నరసరావుపేట మార్గంలో మరొకటి మొత్తం మూడు ఫై ఓవర్లు ఏర్పాటు కానున్నాయి. మిగిలిన అన్ని రహదారుల్లో అండర్ పాస్ లు ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి గతంలోనే ప్రణాళిక మొత్తం పూర్తిచేశారు.

రైతులకు పరిహారం

బైపాస్ ఏర్పాటు చేయనున్న 16.384 కి.మీ దూరంలో 95 శాతం రైతులకు సంబంధించిన భూములకు పరిహారాన్ని ఎన్ హెచ్ఎఐ చెల్లించింది. మరో 5 శాతం వివిధ సాంకేతిక కారణాలతో చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఆ నగదును కూడా నరసరావుపేట ఆర్డీవో ఖాతాలో జమ చేశారు. అయితే బైపాస్ ఏర్పాటు చేయనున్న మార్గంలో పలుచోట్ల తోటలు, బావులు, పైపులైన్లు ఉన్నాయి. ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రధాన పైపులైన్లు గతంలోనే దెబ్బతినడంతో వాటిని కూడా ఎన్ హెచ్ఎఐ నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి రైతులకు పరిహారం కూడా త్వరలోనే చెల్లించి రెండు నెలలో పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

రెండు నెలల్లో పనులు మొదలు పెడతాం

చిలకలూరిపేట బైపాస్ పనులు బీఎస్పీఎల్ కంపెనీకే తిరిగి అప్పగించాం. సాంకేతికంగా అన్ని పూర్తి చేసిన తరువాత రెండు నెలల్లో బైపాస్ పనులు మొదలు పెడతాం. త్వరితగతిన పనులు పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. - టి శ్రీనివాస్ , ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్‌హెచ్ఏఐ.

ఇదీ చదవండీ..TDP Mahanadu: 'ఎన్టీఆర్​కు భారతరత్న ఇప్పించటమే నిజమైన నివాళి'

ABOUT THE AUTHOR

...view details