Government Try to See To Increase Land Value: భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో 50గ్రామాలుంటే.. దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆధారంగా ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల మార్కెట్ విలువను పెంచబోతున్నారు. ఈ పెంపులో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న స్థలాల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్ విలువలు ఎంత? రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం బేరీజు వేస్తూ కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేయబోతున్నారు. ఇవి జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
పట్టణాలు, నగరాల్లో వార్డుల వారీగా పెంచాలన్న విధంగా చర్చలు సాగుతున్నాయి. గ్రామాల విషయంలోనూ ఇదే విధానం అనుసరించాలని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ విలువలు పెరిగే కొద్దీ కొనుగోలుదారుడు చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి. ప్రభుత్వ ఖజానా నిండుతుంది. కొన్నిచోట్ల మాత్రమే 10శాతం నుంచి 20శాతం వరకు మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉంది. మిగిలినచోట్ల చాలా వరకు 30శాతం పైనే మార్కెట్ విలువలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 2020 తర్వాత మార్కెట్ విలువలు పెంచనందున స్పెషల్ రివిజన్ పేరుతో మార్కెట్ విలువలు పెంచేసి, ఫీజుల రూపంలో ఆస్తుల కొనుగోలుదారుల నుంచి పిండేయాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఒకేరకంగా ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెరిగేవి. కొన్నిచోట్ల డోర్ నెంబర్ల ఆధారంగా మార్కెట్ విలువలు ఉండేవి. ప్రతి ఏడాదీ ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి అర్బన్ ప్రాంతాల్లో మార్కెట్ విలువ సవరిస్తారు. ఆగస్ట్ ఒకటి నుంచే.. రెండేళ్లకోసారి గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్ విలువలను సవరిస్తారు. ప్రతి ఏడాదీ మార్కెట్ విలువ సవరించడం ఆనవాయితీ. 2020లో చివరిగా మార్కెట్ విలువ సవరించారు. కోవిడ్ కారణంగా 2021లో సవరించలేదు. సంప్రదాయంగా వస్తోన్న ఆనవాయితీని పక్కనబెట్టిన ప్రభుత్వం స్పెషల్ రివిజన్ పేరుతో ఎప్పుడుపడితే అప్పుడు మార్కెట్ విలువలను పెంచుతూ వస్తోంది.