ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tenant farmers Problems: సమస్యలన్నీ పరిష్కరిస్తానన్న జగన్​.. మాపై చిన్నచూపు ఎందుకంటున్న కౌలురైతులు - AP Latest News

Problems of tenant farmers in state: రాష్ట్రంలో ఉన్న సాగుభూమిలో ఎక్కువ శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఎన్నికల ముందు రైతు సంక్షేమం కోసం పని చేస్తాను.. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన జగన్​ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రతీ విషయంలోనూ కౌలు రైతులకు అన్యాయం చేస్తోంది.

Problems of tenant farmers in state
కౌలు రైతులకి అన్యాయం చేస్తోన్న వైసీపీ సర్కార్‌

By

Published : Jun 22, 2023, 3:56 PM IST

కౌలు రైతులకి అన్యాయం చేస్తోన్న వైసీపీ సర్కార్‌

Problems of tenant farmers in state: రాష్ట్రం మొత్తం సాగుభూమిలో సుమారు 49 నుంచి 53 శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఇందులో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన.. భూమి లేని నిరుపేదలే ఎక్కువగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు రైతు సంక్షేమం కోసం పని చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతులకు చేసిందేమీ లేదు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రతీ విషయంలోనూ కౌలు రైతులకు అన్యాయం చేస్తోంది. అకాలవర్షాలు, ప్రకృతి వైపరీత్యాలకు వాస్తవంగా కౌలు రైతులు నష్టపోతుంటే.. పంట నష్టపరిహారం మాత్రం భూ యజమానులు పొందుతున్నారు.

గతంలో కౌలు రైతులను గ్రామ కమిటీల ద్వారా ఎంపిక చేసి గుర్తింపు కార్డులు ఇచ్చేవారు. కానీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం భూ యజమాని సంతకం చేస్తేనే.. కౌలు రైతుగా గుర్తింపు కార్డులు అందజేస్తామని చెబుతోంది. ఇందుకు సంబంధించి కొత్త జీవోని కూడా తీసుకొచ్చింది. దీంతో అసలైన కౌలు రైతులకు అన్యాయం జరుగుతోంది. పెట్టిన పెట్టుబడి రాక కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేనా మీరు రైతులకు చేస్తామన్న మంచి.. అని కౌలు రైతు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని వీరు కోరుతున్నారు.

కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో విఫలం..2021లో ప్రభుత్వ అనుకూల మీడియా వర్గాలు రాష్ట్రంలో 16 లక్షల 483 మంది కౌలుదార్లు ఉన్నట్లు అంచనా వేశాయి. అయితే అంతమందిలో కేవలం 4 లక్షల 87 వేల మందికి మాత్రమే కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వాలని రాష్ట్రం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నేటికీ ఆ లక్ష్యాన్ని సగం కూడా పూర్తి చేయలేదు. గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులకు పంట రుణాలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ గతంలో హామీ ఇచ్చారు. పంట రుణాలతో పాటు ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపరిహారం కూడా అందజేస్తామని 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేతగా ఉన్న నేటి ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులు అధిక శాతం మంది బీసీ, ఎస్సీ ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఇందులో కౌలు రైతులు ఉన్న జిల్లాలను పరిశీలిస్తే చిత్తూరులో 1శాతం, అనంతపురంలో 2శాతం, శ్రీకాకుళం జిల్లాలో 6శాతం, కడప జిల్లాలో 14శాతంగా ఉంది.

రైతులు ఆత్మహత్యలు..దేశంలో 2010 నుంచి 2021 వరకు దేశవ్యాప్తంగా 63వేల722 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అదే మన రాష్ట్రంలో 2020 సంవత్సరంలో 889 మంది, 2021లో 1065 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అంటే 14.5 శాతం అదనంగా రాష్ట్రంలో రైతులు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం గత నాలుగు సంవత్సరాల్లో 85 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటల పెట్టుబడి ఖర్చులు పెరగడం, గిట్టుబాటు ధరలు అందకపోవడం, ప్రభుత్వ రుణ సదుపాయం కల్పించడంలో విఫలం కావడం, ప్రకృతి వైపరీత్యాలు, కౌలు చెల్లింపులు ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

రాష్ట్రంలో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారో ప్రభుత్వం దగ్గర కచ్చితమైన లెక్కలు లేవు. కౌలు రైతు సంఘాల అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 32 లక్షల కౌలు రైతు కుటుంబాలు ఉన్నాయి. 32 లక్షల కుటుంబాలంటే సుమారు కోటి మంది కౌలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో దాదాపు ఆరు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని ఓ అంచనా. రాష్ట్రంలో ఉన్న మొత్తం కౌలుదార్లలో కోస్తా జిల్లాల్లోనే సుమారు 78 శాతం మంది వున్నారు.

సాగు చేయని భూ యజమానులకు పంట రుణాలు.. 2019-20 నుంచి 2021-22 వరకు రాష్ట్రంలో సుమారు 3 కోట్ల మంది రైతులకు 4లక్షల 37వేల 828 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను బ్యాంకులు ఇచ్చాయి. ఇందులో వాస్తవ సాగు ఆధారంగా కౌలుదార్లు పొందాల్సిన రుణాలు 2లక్షల 39వేల 914 కోట్ల రూపాయలు. అయితే వాస్తవంగా కౌలు రైతులు పొందిన రుణాలు కేవలం 350కోట్లు మాత్రమే. కానీ, సాగు చేయని భూ యజమానులు సుమారు 2లక్షల 32వేల 564 కోట్ల రూపాయల పంట రుణాలు పొందారు. రాజకీయ పలుకుబడితో అడ్డదారిలో రుణాలు పొందిన భూ యజమానులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికి పొందుతున్నారు.

2019-20 నుంచి 2022-23 వరకు రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల 30.86 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం మే నెలలో కురిసిన అకాల వర్షాలకు 7వేల హెక్టార్లలో సాధారణ పంటలు, రెండు వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వాళ్లలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. గుర్తింపు కార్డులు కౌలు రైతులకు ప్రభుత్వం ఇవ్వకపోవడం కారణంగా ఆ నష్టపరిహారం భూ యజమానులకు అందాయి. కానీ, సాగుచేసి నష్టపోయిన రైతన్నకు చివరకు కన్నీరే మిగులుతోంది. పట్టించుకోవాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహారించడంతో అసలైన లబ్ధిదారులకు మెుండిచేయ్యే మిగులుతోంది.

ఏమాత్రం ఉపయోగపడని రైతు భరోసా కేంద్రాలు.. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు కౌలు రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. విత్తనాలు, పురుగు మందులు కౌలు రైతులకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. పండిన పంటను అమ్ముకోవడానికి కౌలు రైతులు తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో వారి పంట రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేయటం లేదు. దీంతో దళారులకి తక్కువ డబ్బులకు అమ్ముకోవాలి వస్తోందని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు..కౌలు తీసుకున్న పొలంపై పదకొండు నెలలు మాత్రమే కౌలు రైతుకి హక్కు ఉంటుంది. ఈ పదకొండు నెలల్లో రెండు పంటలు పండే అవకాశం ఉంటుంది. వర్షం మీదే ఆధారపడే భూముల్లో మహా అయితే కేవలం ఒక్క పంట మాత్రమే పండుతుంది. దీంతో పెట్టిన పెట్టుబడి రాక అనేక మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులను గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల సహాయంతో గుర్తించి వారందరికీ కౌలు రైతు గుర్తింపు కార్డులు అందజేయాలి. సాధారణ రైతులకు ప్రభుత్వం నుంచి అందే.. అన్ని రకాల సౌకర్యాలు కౌలు రైతులకు అందించాలి. అప్పుడే రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలను అరికట్టడం సాధ్యమవుతుంది.

వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. ఆ గుర్తింపు కార్డులు లేకపోవడంతోనే నానా అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ రైతులకిచ్చిన హామీలను మరిచారని, వెంటనే వాటిని అమలు చేయాలని కోరుతున్నారు. ఎప్పుడూ బటన్‌ నొక్కి ప్రజల సమస్యలు తాను తీరుస్తానని చెబుతున్న జగన్‌ సర్కార్‌.. కౌలురైతులకు మాత్రం ఏ బటన్‌ ఎందుకు నొక్కడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇలానే కొనసాగితే మరిన్ని రైతు ఆత్మహత్యలు జరుగుతాయని, ఇప్పటికైనా.. సర్కార్‌ మేల్కొని రైతుల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details