Chandrababu spoke to Rajinikanth on phone: ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. కొందరు రాష్ట్ర మంత్రులు, వైసీపీ నాయకులు పరుషమైన వ్యాఖ్యలతో తీవ్రమైన విమర్శల దాడి చేయడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వాటిని పట్టించు కోవద్దని కోరారు. నాలుగు మంచి మాటలు చెప్పినా.. వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రజినీకాంత్‌పై వారు మాటల దాడి చేయడం విచారకరమనీ.. తాను చాలా బాధపడుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అవేమీ తాను పట్టించుకోవడం లేదని.. తేలిగ్గా తీసుకోవాలని రజనీకాంత్ బదు లిచ్చారు. ఉన్న విషయాలే చెప్పానన్న రజినీ ఎవరెన్ని విమర్శలు చేసినా లెక్క చేయనని తేల్చి చెప్పారు. తాను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాననీ.. తన అభిప్రాయం మారదని రజనీకాంత్ స్పష్టం చేశారు.
ఏప్రిల్ 28న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రజనీకాంత్.. ఆయనతో తనకున్న అనుభవాల్ని, సినీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎన్టీఆర్ నుంచి ఎలా స్పూర్తి పొందిందీ వివరించారు. చంద్రబాబును దార్శనికుడిగా కొనియాడారు. హైదరాబాద్ ఈ రోజు ఇంతగా అభివృద్ధి చెందిందంటే దానికి అప్పట్లో చంద్రబాబు చేసిన కృషే ప్రధాన కారణమని ప్రశంసించారు. దాన్ని తట్టుకోలేని ఆర్ కె రోజా వంటి మంత్రులు, కొడాలి నాని వంటి వైసీపీ నాయకులు రజనీకాంత్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. వారి మాటల దాడి ఇప్పటికీ కొనసాగుతోంది.
ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా అధికార పార్టీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదని గుర్తుచేశారు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారని.. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరని దుయ్యబట్టారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్‌పై వైసీపీ పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే అని ఎద్దేవా చేశారు. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలని హితవు పలికారు.