Telangana New Secretariat : తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న సచివాలయ బ్లాక్‌ల స్థానంలో అత్యాధునిక పాలన సౌధాన్ని నిర్మించే పనులు 2020 జనవరి నాలుగో తేదీన పనులు ప్రారంభమయ్యాయి. మొదట 400 కోట్లు, ఆ తర్వాత 617 కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణాన్ని చేపట్టారు. సచివాలయం ప్రాంగణం మొత్తం విస్తీర్ణం 26.98 ఎకరాలు కాగా వాస్తు దోషాలను నివారించి దీర్ఘ చతురస్రాకారంలో 20 ఎకరాల్లో కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు కొట్టి పడేలా దక్కన్, కాకతీయ శైలి ఉండేలా ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్స్ భవన నమూనా సిద్ధం చేశారు.
Telangana New Secretariat Inauguration : భవనం లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా విశాలమైన కారిడార్లతో నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఆరు అంతస్తుల్లో సచివాలయ ప్రధాన భావనాన్ని నిర్మించారు. దీని విస్తీర్ణం 7.88 లక్షల చదరపు అడుగులు. మధ్యలో భవనం పైన ఐదు అంతస్థుల మేర భారీ గుమ్మటాలతో కూడిన సెంట్రల్ టవర్స్ నిర్మాణం అవుతోంది. అతిథుల కోసం నిర్మిస్తున్న ఈ పోర్టీకో టవర్స్‌ను.. ఆర్నమెంటల్ డోమ్స్, కార్వింగ్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
భవనంపై మొత్తం 34 గుమ్మటాలు ఏర్పాటు చేయగా... తూర్పు, పశ్చిమ వైపుల్లో భవనం మధ్యలో రెండు అతిపెద్ద గుమ్మటాలు, వాటిపై జాతీయ చిహ్నాలు ఏర్పాటు చేశారు. కాంస్యంతో 18 అడుగుల ఎత్తు, ఐదు టన్నుల బరువుతో జాతీయ చిహ్నాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండే భవనం మధ్యలో విశాలమైన కోర్ట్ యార్డ్ వచ్చేలా నిర్మాణం చేశారు. మధ్యలో భారీ ఫౌంటేయిన్ రానుంది.
Telangana New Secretariat Inauguration Date : ప్రధాన భవనం 2.45 ఎకరాల్లో, కోర్ట్ యార్డ్ 1.98 ఎకరాల్లో ఉంటుంది. సచివాలయ ప్రధాన భవనం నిర్మాణ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్ తదితర అంతర్గత పనులు కొనసాగుతున్నాయి. సచివాలయ భవనం చుట్టూ, కోర్ట్ యార్డ్ లోపల రాజస్థాన్ ధోల్‌పూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రెడ్ సాండ్ స్టోన్‌తో క్లాడింగ్ పనులు చేశారు.
ప్రధాన ప్రవేశద్వారం పనులతో పాటు పోర్టికో పనులు తుదిదశలో ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్తు పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక లిఫ్టు ఉండనుంది. భద్రతాపరంగా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.