TDP PATTABHI ON TABS : విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందించిన ట్యాబ్‌ల ద్వారా సీఎం జగన్‌కు పుట్టినరోజు సందర్భంగా రూ.221 కోట్ల భారీ కానుక లభించిందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ రాయితీతో రూ.11,999కి లభిస్తున్నా ప్రభుత్వం రూ.13,262 చెల్లించిందని ఆరోపించారు. ఒక్కో దానిపై అదనంగా రూ.1,263 కట్టబెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వం భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నందున తక్కువలో తక్కువ ఒక్కోటి రూ.9 వేలకే లభించేదని.. కానీ జగన్ రూ.13,262 ధరకు చేసుకున్న లోపాయికారీ ఒప్పందం ద్వారా.. ఏకంగా రూ.221 కోట్లు వెనకేసుకున్నారని విమర్శించారు.
ట్యాబ్‌లో కంటెంట్ కోసం రేపోమాపో అస్తమించబోతున్న బైజూస్ తప్ప, మరే కంపెనీ దొరకలేదా? అని ప్రశ్నించారు. ఈ సంస్థ 1.2 బిలియన్ డాలర్ల అప్పు ఎగ్గొట్టిందని, దానిపై రుణదాతలు ఒత్తిడి చేస్తున్నారని ఓ జాతీయ ఆంగ్ల దినపత్రికలో రాశారని పేర్కొన్నారు. బైజూస్ 2020-21లో రూ.4,588 కోట్ల అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని.. నిరుడు 2,500 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు.