రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని తెదేపా నేత జీవీ ఆంజనేయులు అన్నారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన దిశ చట్టం ఎక్కడకు వెళ్లిందని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పొడపాడులో అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించారు. మతిస్థిమితం లేని మహిళ పై అత్యాచారానికి పాల్పడడం బాధాకరమన్నారు.
వైకాపా నేతలే దాడులకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హోంమంత్రి సొంత జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం శోచనీయమన్నారు. దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో నిందితులను శిక్షిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా న్యాయం చేయలేకపోయిందని విమర్శించారు. వెంటనే బాధితురాలికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు.