గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నిజంగా నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే అమరావతి కోసం పోరాడుతున్న రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాలని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్.రాజు అన్నారు. వేల కోట్ల అవినీతిపై ప్రశ్నించేవారి నుంచి తప్పించుకోవడానికి.. సీఎం జగన్ మెప్పుకోసం, మంత్రివర్గ విస్తరణలో భాగంగా రానున్న కాలంలో మంత్రి పదవి పొందాలనే అమరావతి భూముల మీద డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. తెనాలిలో ఎస్సీ నాయకుడు నలుకుర్తి. రమేశ్ తండ్రి మరణించడంతో పరామర్శకు వచ్చిన రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆళ్ల రామకృష్ణ రెడ్డి మూడు అడుగుల కమలహాసన్ లాగా కరకట్ట మీద నటన బాగా చేస్తున్నారని తెదేపా ఎద్దేవా చేశారు. అమరావతిలో దళితుల భూములు లాక్కున్నారని పదేపదే వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దళితుల భూములను లాక్కున్న చరిత్ర దివంగత రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డిలకే దక్కుతుందని అన్నారు.