రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి సరైన పాలన లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. గుంటూరులో మాట్లాడిన ఆయన... రాష్టానికి ఒకే రాజధాని అమరావతి ఉండాలని గతంలో అంగీకరించిన జగన్..అధికారంలోకి రాగానే మాట తప్పి మడమ తిప్పారన్నారు. ప్రజల ఆమోదం, రైతుల త్యాగంతో ఏర్పడిన రాజధానిని కూల్చడానికి వైకాపా ప్రయత్నిస్తుందని విమర్శించారు. గత 298 రోజులుగా అమరావతి రైతులు అలుపెరుగని పోరాటం చేస్తుంటే.. వైకాపా నేతలు రైతులు, మహిళలను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.
పోలీసు జులుం ఉపయోగించి అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విశాఖలో వైకాపా నేతలు ఆస్తులు కొన్నారు కాబట్టే, రాజధానిని విశాఖ తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. పేదవారి పొట్ట కొట్టిన ఏకైక ప్రభుత్వం వైకాపాదే అని విమర్శించారు.