Task Force Committee Meeting on Interlinking of Rivers:గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్ట్‌ను ఆహ్వానిస్తూనే సాంకేతిక అంశాలపై ఏపీ అభ్యంతరాలు తెలిపింది. ఆ అంశాలపై చర్చించేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ ఏపీ అధికారులతోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. నదుల అనుసంధానంపై హైదరాబాద్‌లో నిర్వహించిన టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశానికి (Task Force Committee Meeting on Interlinking of Rivers) హాజరైన రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి ఈ మేరకు తమ అభిప్రాయాలు వెల్లడించారు. దిగువ రాష్ట్రంగా ఏపీకి కృష్ణా, గోదావరి నదుల్లో మిగులు జలాలపై హక్కు ఉందని.. గోదావరి ట్రైబ్యునల్ ప్రకారం రాష్ట్ర హక్కులకు భంగం కలగనివ్వకూడదని కోరారు.
కర్ణాటక అంతర్గత అనుసంధాన ప్రాజెక్టులో తుంగభద్ర కుడి కాలువ.. గోదావరి- కావేరి అనుసంధానంపై ఏపీ ప్రత్యామ్నాయ ఆలోచనను ప్రతిపాదించింది. పోలవరంనుంచి ప్రకాశం బ్యారేజికి, అక్కడి నుంచి వైకుంఠపురం, నాగార్జునసాగర్ శ్రీశైలం జలాశయం నుంచి సోమశిలకు మళ్లించేలా తాము ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. దీనివల్ల వ్యయం, భూసేకరణ తగ్గనున్నట్లు ఏపీ అధికారులు వివరించారు. గోదావరి- కావేరి అనుసంధానం (Godavari-Caveri Linkage Project) వల్ల నాగార్జునసాగర్, శ్రీశైలంజలాశయాల్లో అదనంగా నీటిని నిల్వ చేసే అంశాన్నీ పరిశీలించాలని విన్నవించారు.
ఇందులో భాగంగానే కర్ణాటకలో అంతర్గతంగా చేపడుతున్న నదుల అనుసంధానం ప్రమాణాల తరహాలోనే ఏపీలోనే అంతర్గత అనుసంధానానికి ఆమోదించాలని సూచించారు. తుంగభద్ర కుడి కాలువనూ కర్ణాటక అంతర్గత అనుసంధాన ప్రాజెక్టులో (Karnataka Internal Connectivity Project) చేర్చాలని కోరారు. గోదావరి- కావేరి అనుసంధానానికి సంబంధించిన ఎంవోయూపై తాము మరింత అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు.