Soft Tennis Player Surya Akash Wins Silver Medal : చదువుకిచ్చే ప్రాధాన్యతతో పోలిస్తే మన దగ్గర క్రీడలకు ప్రోత్సాహం తక్కువే. పిల్లల ప్రతిభ చూసి కన్నవారు అండగా నిలిచినా ప్రభుత్వాల నుంచి లభించే సహకారం నామమాత్రమే. అందులో క్రికెట్, టెన్నిస్, షూటింగ్ లాంటి ఆదరణ ఉన్న ఆటలు కాకుండా విభిన్న క్రీడల్ని ఎంచుకుంటే.. పట్టించుకునేవారే ఉండరు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన ప్రతిభను నమ్ముకుని సాఫ్ట్ టెన్నిస్‌లో సంచలనాలు నమోదు చేస్తున్నాడు.గుంటూరుకు చెందిన పోకల సూర్య ఆకాశ్. అథ్లెట్‌గా క్రీడా జీవితాన్ని ప్రారంభించిటెన్నిస్ ఆటలో రాణిస్తూ.. ఇప్పుడు సాఫ్ట్ టెన్నిస్‌లో పతకాల పంట పండిస్తున్నాడు. ఇటీవల థాయ్ లాండ్లో జరిగిన వరల్డ్ టూర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో డబుల్స్ విభాగంలో వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు .
Soft Tennis Player Surya Akash Wins Silver Medal :గుంటూరు ద్వారకనగర్‌కు చెందిన సూర్య ఆకాశ్ కేఎల్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్నాడు. అటు క్రీడల్లోనూ, ఇటు చదువులోనూ రాణిస్తున్నాడు. పాఠశాల దశ నుంచే క్రీడల్లో ప్రతిభ చూపిన ఆకాశ్‌ను తల్లిదండ్రులు సుబ్బారావు, గాయత్రి ప్రోత్సహించారు. ఆకాశ్‌లోని నైపుణ్యాల్ని గమనించిన కోచ్ శివప్రసాద్ టెన్నిస్ క్రీడలో శిక్షణ ఇచ్చారు. టెన్నిస్ క్రీడాకారుడిగా పలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన ఆకాశ్ నాలుగేళ్ల కిందట సాఫ్ట్ టెన్నిస్పై ఆసక్తి పెంచుకున్నాడు. తల్లిదండ్రులు, కోచ్‌ల సహకారంతో స్వల్ప సమయంలోనే ఈ ఆటలో ప్రావీణ్యం సంపాదించాడు.
గుంటూరు టు ఫిల్మ్ ఎడిటర్ వయా అమెరికా.. తొలి మహిళా ఎడిటర్ సృజన అడుసుమిల్లి
Soft Tennis Player Surya Akash Succuful Story:మన దేశంలో చాలా మందికి పరిచయం లేని సాఫ్ట్ టెన్నిస్ గురించి అందరికీ తెలిసేలా చేయాలనుకున్నాడు ఆకాశ్. ఎలాగైనా సరే ఈ క్రీడలో మేటి అనిపించుకోవాలని తనకంటూ ఓ ప్రత్యేకను సృష్టించుకోవాలని పరితపించాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎన్టీఆర్ స్టేడియంకు వెళ్లి సాధన చేసేవాడు. ఏ పోటీలో పాల్గొన్నా పతకం సాధించాలనే పట్టుదలతో ఆడేవాడు. అతని దీక్షా, సంకల్పానికి ప్రతీకగా ఆనతికాలంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలతో మెరిశాడు.
2019 హరియాణాలో జరిగిన ఆలిండియా టెన్నిస్ పోటీల్లో ఆకాశ్ ప్రథమ స్థానంలో నిలిచాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో పంజాబ్‌లో జరిగిన ఆలిండియా నేషనల్ ర్యాంకింగ్ టోర్నీలోనూ విశేష ప్రతిభ కనబరిచాడు. 2021, 2022లో హైదరాబాద్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో హరియాణాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాడు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఆటతో మెరవడంతో అంతర్జాతీయ క్రీడా వేదికలపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది.