Condition of Employees in YCP Government: ‘నీతి లేని ఓ నాయకుడా..! పలుకు లేని పరిపాలకుడా..!’ అంటూ జగన్ పాలనపై ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు పాట రాశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీన జీతం వస్తుందనుకునే రోజులు పోయాయి. పింఛను డబ్బు ఎప్పుడొస్తుందో తెలియదు. జీతం ఇస్తే చాలనే పరిస్థితి వచ్చింది. ప్రతినెలా పాలు, సరకులు, బ్యాంకు రుణాల వాయిదాలకు ఎలా సర్దుబాటు చేయాలన్న ఆందోళనే. గత నెల 15తేదీ వరకు జీతాలు అందలేదు. ఏ నెలలోనూ ఐదో తేదీకి ముందు జీతాలు రాకపోవడంతో కొందరు ఈఎంఐ గడువు మార్చుకుంటున్నారు.
సమయానికి వచ్చేలా చేస్తా: ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి:ప్రభుత్వ ఉద్యోగి ముఖంలో చిరునవ్వు కనిపిస్తేనే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాడు. పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడతాడు. ప్రతి ఉద్యోగికి చెబుతున్నా.. వారికి రావాల్సినవన్నీ సరైన సమయానికి వచ్చేలా, ప్రతి డీఏ సమయానికి వచ్చేలా చేస్తానని హామీ ఇస్తున్నా
వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఏ నెలలోనూ ఒకటో తేదీన జీతం అందట్లేదు. డీఏ బకాయిలు చెల్లించకుండానే ఇచ్చినట్లు చూపి, ఆదాయపన్ను మినహాయించేశారు. పీఎఫ్, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ రుణాలకు దరఖాస్తు చేస్తే నెలలు గడిచినా ఇవ్వరు. సీపీఎస్ రద్దు హామీ అటకెక్కింది. పొరుగుసేవల సిబ్బంది మెడపై తొలగింపు కత్తి వేలాడుతోంది. హక్కుల కోసం ఆందోళనలు చేస్తే నిర్బంధాలు, బైండోవర్ కేసులతో ఉద్యోగులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది.
ఇవ్వని సొమ్ముకూ ఆదాయ పన్ను
ఉద్యోగులకు 2018 జులై, 2019 జనవరి డీఏ బకాయిలు చెల్లించాలి. వీటి బకాయిలను పాత పింఛను విధానంలో ఉన్నవారికి జీపీఎఫ్‌లో జమ చేసి, సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు నగదు రూపేణా చెల్లించాలి. ఇవేవీ ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపించి, జీతాల నుంచి ఆదాయపన్ను మినహాయించేశారు. 2022 జనవరి, జులై నెలల్లో చెల్లించాల్సిన డీఏ బకాయిలు ఇవ్వలేదు. సీపీఎస్ ఉద్యోగులకు నగదు రూపేణా 90% చెల్లించాలి. ఈ బకాయిలు రూ.3వేల కోట్ల వరకు ఉండగా.. మిగతా ఉద్యోగులకు చెల్లించాల్సినవి రూ.10వేల కోట్ల వరకు ఉన్నాయి.
దాచుకున్న డబ్బులకూ ఇబ్బందే
జీపీఎఫ్, పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ రుణాలు, క్లెయిముల బిల్లులు రూ.1,600 కోట్లకుపైగా పెండింగులో ఉన్నాయి. వీటన్నింటినీ గతేడాది ఏప్రిల్ నాటికి క్లియర్ చేస్తామని చర్చల్లో మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. ఇప్పటికీ రాకపోవడంతో.. పిల్లల పెళ్లిళ్లనూ వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.
జీతాల్లో కోత వేసి.. వాడేసుకుని..
సీపీఎస్ ఉద్యోగుల నుంచి మినహాయించిన వాటాను గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రాన్ ఖాతాకు జమ చేయట్లేదు. ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోగా.. ఉద్యోగుల నుంచి మినహాయించిన దాన్నీ వాడేసుకుంటోంది. కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రవాటాను 14%కు పెంచాల్సి ఉన్నా, ఇప్పటికీ 10శాతమే చెల్లిస్తోంది. ఒడిశా, కర్ణాటక, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు 14% చెల్లించేందుకు గెజిట్‌ను విడుదల చేశాయి. దాదాపు రూ.1,800 కోట్లను ప్రాన్ ఖాతాకు ప్రభుత్వం జమచేయాల్సి ఉంది. అలా చేయకపోవడంతో ఉద్యోగులు పీఎఫ్ నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. మరోపక్క సీపీఎస్ ఉద్యోగుల సొమ్మును హామీగా పెట్టి ప్రభుత్వం అప్పులు చేస్తోంది.
పీఆర్సీలోనూ అదే తంతు..