Public Opinion on ACCMC: అమరావతి గ్రామాల్లో వరుసగా మూడోరోజూ అదే పరిస్థితి. కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని మరో మూడు గ్రామాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. 19 గ్రామాలతో ఏర్పాటు చేయనున్న అమరావతి మున్సిపల్ కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తూ వెలగపూడి, మల్కాపురం, మందడంలో గ్రామసభలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. సీఐర్డీఏ చట్టం ప్రకారం 29 గ్రామాలతో కాకుండా 19 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఏంటని రైతులు నిలదీశారు. రెండేళ్లుగా ఆందోళన చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం... ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం.. అమరావతి ప్రాంత వాసులను మరోసారి మోసం చేయడమేనన్నారు. రాజధాని ఏర్పాటు కోసం భూములిచ్చామని.. ఇప్పుడు విభజించడమేంటని వెలగపూడి ప్రజలు నిలదీశారు. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటు అక్కడి రాజధాని గ్రామ ప్రజల ఆమోదంతోనే జరిగిందని అధికారులు తెలపగా.. తీర్మానం కాపీలు చూపాలని ప్రజలు కోరారు.
29 గ్రామాలను కలిపే ఉంచాలి
రాజధాని ప్రాంతంలో రెండేళ్లకుపైగా ఎలాంటి అభివృద్ధి చేపట్టని ప్రభుత్వం.. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చూస్తే.. భూముల తాకట్టు కోసమేనన్న సందేహం కలుగుతోందని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం విభజించు, పాలించు విధానం అమలు చేస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 గ్రామాలను కలిపే ఉంచాలని డిమాండ్ చేశారు.
29 గ్రామాలతో కార్పొరేషన్‌కు తీర్మానం
వెలగపూడి, మల్కాపురం, మందడంలో ప్రజలంతా మూకుమ్మడిగా ఒకేమాట మీద నిలబడ్డారు. ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అందరూ చేతులెత్తారు. సీఐర్డీఏ(CRDA Act) చట్టంలోని 29 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.