ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నరసరావుపేట నియోజకవర్గంలో రెండవ రోజు 326 నామినేషన్లు దాఖలు

By

Published : Feb 4, 2021, 3:33 PM IST

రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగాల్సిన గ్రామాల్లో నామినేషన్​ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో 326 నామినేషన్లు దాఖలయ్యాయి.

local elections
పంచాయతీ ఎన్నికలు

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని రెండోరోజు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నరసారావుపేట, రొంపిచర్ల మండలాల్లో సర్పంచి, వార్డుమెంబర్ల నామపత్రాలు మొత్తం 326 దాఖలైనట్లు అధికారులు తెలిపారు.

రెండోరోజు నామపత్రాల దాఖలు వివరాలు:

నరసారావుపేట:

మండలంలో ఏర్పాటు చేసిన ఆరు క్లస్టర్లకు 21 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 21 మంది సర్పంచి, 95 మంది వార్డుమెంబర్ స్థానాలకు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.

రొంపిచర్ల:

మండలంలోని 28 గ్రామపంచాయితీలకు సర్పంచి పదవికి 34 మంది, 176 మంది వార్డుమెంబర్ల అభ్యర్థులుగా నామపత్రాలు అందజేశారు.

సత్తెనపల్లి:

నియోజకవర్గంలోని నకరికల్లు మండలంలో 5 క్లస్టర్లలో 17 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. సర్పంచి అభ్యర్థులుగా 18 మంది, వార్డు మెంబర్ స్థానాలకు​ 64 మంది నామపత్రాలు దాఖలు చేశారు.

కలెక్టర్ పర్యటన:

నరసరావుపేట నియోజకవర్గంలో జిల్లా అదనపు కలెక్టర్ దినేశ్​ కుమార్ పర్యటించారు. రెండోదశ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరంఆయన​ మీడియాతో మాట్లాడారు.

ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. రెండవరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందన్నారు. జిల్లా, డివిజన్ స్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని... ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, ఎమ్మార్వో రమణ నాయక్, ఎంపీడీవో బూసి రెడ్డి, రొంపిచర్ల ఎమ్మార్వో జాన సైదులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాడికొండ:

మండలంలోని మోతడక గ్రామంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను జియో టాగింగ్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని తెదేపా నాయకులు మండిపడ్డారు. పేదల కోసం ప్రభుత్వం లక్షల రూపాయాలు ఖర్చు చేసిందని గుర్తు చేస్తూ.. లబ్ధిదారులను ఆకర్షించే ప్రయత్నం చేశారన్నారు. ఓటర్ల దృష్టి మరలించటంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేపల్లె:

నియోజకవర్గంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల వేడి రసవత్తరంగా మారుతోంది. సర్పంచి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు నామినేషన్ ఉపసంహరణ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. స్థానిక నేతలు,పెద్దలతో రాజీలు, ఒప్పందాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రేపల్లె మండలంలోని వడ్డేవారిపాలెం, బొందల గురువు, రాజుకాల్వ, నల్లూరు నార్త్, నిజాంపట్నం మండలంలోని నిజాంపట్నం, హారీస్ పేట, ఆముదాల పల్లి, నగరం మండలంలోని మీసాల వారిపాలెం పంచాయతీలలో సర్పంచి పదవికి ఒక్క నామినేషన్ దాఖలు అవ్వడంతో ఏకగ్రీమయ్యే అవకాశం ఉంది. మద్దతు దారులను ఎలాగైనా గెలిపించుకోవాలని పార్టీల నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు.

తెనాలి:

గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్థానిక నేతల​తో జిల్లా వైకాపా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలే ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులకు విజయం కట్టబెడతాయని విశ్వాసం వెలిబుచ్చారు. వైకాపా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ ముందంజలో ఉన్నారన్నారు.

వినుకొండ:

పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులు గెలిచినా ప్రయోజనంలేదని వైకాపా నేత నిమ్మకాయల రాజనారాయణ అన్నారు. మండలంలోని కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో ఆయన మాట్లాడారు. వైకాపా సానుభూతిపరులు కాకుండా వేరే వాళ్లు సర్పంచులుగా గెలిస్తే వారి చెక్​ పవర్​ రద్దు చేస్తారని.. దీంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా, ప్రజలను భయపెట్టే విధంగా రాజనారాయణ మాట్లాడటం చర్చనీయాంశమైంది.

ఏకగ్రీవం చేసుకోవటం వలన ప్రభుత్వం నుంచి రాయితీలు వస్తాయని ఆ దిశగా ఓటర్లు ఆలోచన చేయాలని రాజనారాయణ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేశ్​ను ఒక పావులాగా మార్చుకున్నాడని విమర్శించారు.

గ్రామాల్లో కక్షలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకోవాలని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఓటర్లని కోరారు. ఘర్షణలు, వివాదాల వల్ల కేసులు, కోర్టులతో సమయం వృథా అవటంతో పాటు ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధిని కోరుకోవాలని ప్రజలకు చెప్పారు.

రాజనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​:

వైకాపా నేత నిమ్మకాయల రాజనారాయణపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. తెదేపా మద్దతుదారులు గెలిస్తే చెక్​పవర్​ రద్దు చేస్తామని రాజనారాయణ అనటం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆయన అన్నారు. దీనిపై జీవి నివాసంలో మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న వైకాపా దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే తెదేపా మద్దతుదారులు 70 శాతం విజయం సాధిస్తుందని జోస్యం పలికారు. తమ పార్టీ సానుభూతిపరులైన సర్పంచులపై వైకాపా బెదిరింపులకు పాల్పడితే ప్రజాఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలు: నామినేషన్‌ పత్రంలో చిత్రమైన ప్రశ్నలు

ABOUT THE AUTHOR

...view details