పాలకు సంగం డెయిరీ తక్కువ ధర చెల్లిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో చేసిన ప్రకటనను... సంగం డెయిరీ యాజమాన్యం ఖండించింది. కొన్నేళ్లుగా సంగం డెయిరీ పాడి రైతులకు అత్యధిక ధర చెల్లిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం ధర వరకే కాకుండా లాభాల్లో బోనస్ ఇస్తున్నట్లు పేర్కొంది. 2019-20 సంవత్సరంలో అమూల్ డెయిరీ ఇస్తున్న ధరల కంటే సంగం డెయిరీ అధిక ధరలు చెల్లించినట్లు వివరించింది.
అముల్ డెయిరీ గేదె పాలు లీటరుకు రూ.45.48, ఆవుపాలు లీటరుకు 28 రూపాయలు చెల్లిస్తోంటే... సంగం డెయిరీ గేదెపాలకు 46.83 రూపాయలు, ఆవుపాలకు 30.19 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలోనే 9.06 కోట్ల లీటర్లకు ఈ ధరలు చెల్లించినట్లు స్పష్టం చేసింది. పాల ఉత్పత్తిదారులందరికీ నాణ్యమైన దాణా సరఫరా, పశువైద్య సేవలు, పశువులకు బీమా, రాయితీపై పశుగ్రాస విత్తనాలు, సైలేజీ అందిస్తున్నట్లు వివరించింది.