గుంటూరు జిల్లా మాచర్లకు మండలం రాయవరంలో జరిగిన ఇద్దరు వ్యక్తుల హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ ఎన్.వి.ఎస్.మూర్తి మీడియాకు తెలిపారు. రాయవరంలో గత నెల 29న కాల్పులు కలకలం రేపాయి. రాయవరానికి చెందిన మాజీ సైనికుడు మట్టా సాంబశివరావుకు అతని సమీప బంధువులైన మట్టా బాలకృష్ణ, మట్టా శివాజీ కుటుంబంతో పొలం దారి విషయంలో కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. దీనిపై పోలీసులకు పరస్పరం ఫిర్యాదు కూడా చేసుకున్నారు.
ఆదివారం పొలం వద్ద సాంబశివరావు, బాలకృష్ణ గొడవ పడ్డారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సాంబశివరావు తన వద్ద ఉన్న పిస్టల్‌తో బాలకృష్ణ, శివాజీలపై కాల్పులు జరిపాడు. వివాదాన్ని వారించేందుకు వెళ్లిన మట్టా వీరాంజనేయులు పైనా కాల్పులు జరిపాడు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శివాజీ, బాలకృష్ణను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ ప్రాణాలు విడిచారు. వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలించారు.