విద్యా సంస్థల కోసం ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించటాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది.విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కోసం దాతలు ఇచ్చిన భూములను స్థానిక తహసీల్దార్ ఇళ్ల పట్టాలకు కేటాయించారు. ఈ విషయంపై హెడ్ మాస్టర్, దాతల తరఫున తాండవ యోగేశ్ అనే న్యాయవాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.
పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాష్ట్రంలో చాలాచోట్ల ఇలాగే జరిగిన నేపథ్యంలో పిల్ పరిధిని రాష్ట్రం మొత్తానికి అన్వయించాలని న్యాయస్థానం నిర్ణయించింది. ఈ ప్రకారం ఏపీలో ఎక్కడా విద్యా సంస్థల భూములు ఇళ్ల పట్టాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయవాది యోగేశ్ తెలిపారు.