Pawan Kalyan: ఇప్పటం గ్రామంలో జనసేన అభిమానుల గడపలు కూల్చిన వైసీపీ సర్కారు గడప తాను కూలుస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పటంలో బాధితులకు పవన్ కల్యాణ్ సాయం అందించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని అడ్డుకుని తీరతామని అన్నారు. 175 సీట్లు గెలుస్తామన్న జగన్ వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాలకు జగన్, వైఎస్ పేర్లు పెట్టడాన్ని పవన్ తప్పుబట్టారు. వైఎస్‌ఆర్.. గాంధీ, నెహ్రూలను మించిన నాయకుడు కాదని పవన్ వ్యాఖ్యానించారు. 2024లో రాజకీయాలు మారాలని అన్నారు. 2024లో వైసీపీ నేతలు ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. వైసీపీ నేతలది ఆధిపత్య అహంకారమని దుయ్యబట్టారు. వారిలా తాను కోడికత్తులతో డ్రామాలు ఆడలేనని విమర్శించారు.
జనసేన రౌడీసేన కాదని.. విప్లవ సేన అని పేర్కొన్నారు. వైసీపీ రాజకీయ పార్టీయా.. ఉగ్రవాద సంస్థా అని నిలదీశారు. వైసీపీని దెబ్బ కొట్టాలంటే మోదీకి చెప్పి చేయనని.. తన యుద్ధం తానే చేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. మోదీతో మాట్లాడిన వాటి గురించి సజ్జలకు ఎందుకని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జగన్‌లా నేను దిల్లీ వెళ్లి చాడీలు చెప్పనని మండిపడ్డారు. మమ్మల్ని బెదిరించే వారు 2024 తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.