గతంలో నివర్ తుపానుతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే విషయంలో అవకతవకలు జరిగాయని.. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో సమగ్ర విచారణ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళి, ఏడీఏ శ్రీనివాసరావు లు కారంపూడిపాడు గ్రామానికి చేరుకుని విచారణ చేశారు.
పొలం లేని వాళ్లు, కౌలుకు సాగు చేయని వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేశారని రైతులు ఆరోపించారు. విచారణ కోసం అధికారులు వస్తే.. అక్రమంగా నగదు తీసుకున్న వారు హాజరు కాలేదని రైతులు తెలిపారు. వారు తీసుకున్న నగదును రికవరీ చేసి, బాధిత రైతులకు ఇవ్వాలని కోరారు. జాబితాలో ఉన్న వారిని విచారించి నివేదిక తయారు చేసి కలెక్టర్ కు ఇస్తామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఘర్షణ జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.