ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో... నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. ఈరోజు ఉదయం 11.35 నిమిషాలకు నాగార్జున సాగర్ డ్యామ్ సీఈ నరసింహ... గంగమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత 12,13,14,15 నంబర్ గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలిపెట్టారు.
కృష్ణమ్మ పరవళ్లు..సాగర్ 4 గేట్ల ద్వారా నీటి విడుదల
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి వస్తున్న ప్రవాహం క్రమంగా పెరుగుతుండటం వల్ల నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తాజాగా నాగార్జునసాగర్ నుంచి అధికారులు నీటిని కిందకు విడుదల చేశారు.
శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి 2లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు వస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు శుక్రవారం నాడే అప్రమత్తం చేశారు. అలాగే కరోనా నేపథ్యంలో.. సందర్శకులు ఎవరూ కూడా డ్యాం చూసేందుకు అనుమతించటం లేదు. ప్రస్తుతం సాగర్‌లో 292 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు. పైనుంచి వరదనీరు భారీగా వస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు సాగర్ డ్యాం ముఖ్య ఇంజనీర్ నరసింహ తెలిపారు.