గుంటూరు జిల్లాలో కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. రెండు జిల్లాల్లో మెుత్తం 111 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 13,505 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఓటరు తనకు నచ్చిన అభ్యర్ధి పేరుకు ఎదురుగా తొలి ప్రాధాన్యతను సూచిస్తూ.. ఒకటో నెంబర్ అంకె వేయాల్సి ఉంటుంది. తర్వాత క్రమంలో మిగతా వారికి కూడా 2,3,4 అంకెలు వేయవచ్చు. తొలి ప్రాధాన్యమున్న ఓటు వేయకుండా.. 2,3,4 అంకెలు వేస్తే ఆ ఓటు చెల్లదని అధికారులు స్పష్టం చేశారు.