MIRCHI FARMERS LOSSES DUE TO RAIN: అకాల వర్షాలతో మిర్చి రైతులు దెబ్బతిన్నారు. అనుకోని వర్షాలు శరాఘాతంలా మారాయి. పంట బాగా పండి చేతికొచ్చే సమయానికి వర్షాలు కురవడంతో మిర్చి రైతులు నష్టపోయారు. ఎరుపు కాయ కాస్త తాలుకాయగా మారడంతో వ్యాపారులు పంటను తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిపంట అకాల వర్షాలకు తడిసిపోవటంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైతన్నలు అల్లాడుతున్నారు. కోతలు పూర్తయి ఆరబెట్టుకుంటున్న వేళ వర్షాల జోరుతో రైతుల పరిస్థితి తలకిందులైంది. తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందుకు కష్టించినట్లే ఇప్పుడు వర్షం నుంచి మిరపకాయల్ని కాపాడుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. అకాల వర్షాలతో మిర్చి రైతులు రెండు విధాలా నష్టపోయారు.
ఓవైపు పొలాల్లోని మిర్చి వర్షాలకు దెబ్బతినగా, మరోవైపు కోత పూర్తై కల్ల్లాల్లో ఆరబెట్టిన మిర్చి సైతం తడిసిపోయింది. పట్టలు కప్పినప్పటికీ చాలా వరకు మిర్చి బస్తాలు తడిశాయి. మిర్చి తేమగా ఉండటంతో దాన్ని ఆరబెడుతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మిర్చి బూజు పట్టి కొన్నిచోట్ల కుళ్లిపోతున్నాయి. ఎక్కువ శాతం మిర్చి పంట తాలు కాయలుగా మారిపోతున్నాయి. కనీసం ఎకరానికి 5, 6 క్వింటాళ్ల వరకు తాలు కాయలుగా మారిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిర్చి తడవటంతో ధర పడిపోయే ప్రమాదం ఏర్పడింది. గతంలో క్వింటా 20 వేల వరకు ధర పలకగా ఇప్పుడు 15 వేలకు పడిపోయింది. తాలుకాయలు గతంలో 10వేల రూపాయల వరకు ఉండగా ఇప్పుడు 5 వేల రూపాయలకు పడిపోయింది. పంటపొలాల్లో ఉన్న మిర్చి కూడా వర్షం కారణంగా పాడైపోతోంది. కాయలకు మచ్చ పడితే ధర సగానికి పైగా పడిపోతుంది. ఇపుడు తడిసిన మిర్చిని కొనేందుకు ఎవరూ ముందుకు రారని తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.