గుంటూరు జిల్లాలోని శ్రీ వేంకటేశ్వర శీతల గిడ్డంగిలో పాడైపోయిన మిర్చి పంట రైతులు.. ఆందోళనకు దిగారు. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం రైతులు ఆరోపించారు. ఒక్కో టిక్కికి 400 రూపాయల చొప్పున చెల్లించామన్నారు. అయితే గత రెండు వారాలుగా గోదాములోని ఏసీలు సరిగా పనిచేయటం లేదని.. కాయలన్నీ బూజు పట్టాయని ఆవేదన చెందారు.
ఇప్పటికే ఓ సారి ఆందోళన చేసినా.. పరిహారం విషయంలో హామీ రాకపోవడంపై మరోసారి ఆందోళనకు దిగారు. మిర్చిని గోదాం బయట పారబోసి నిరసన తెలిపారు. యాజమాన్యం తీరు పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం వచ్చేలా చూస్తామని పోలీసులు రైతులకు తెలిపారు. స్పష్టమైన హామీ వచ్చేవరకూ ఆందోళన విరమించబోమని రైతులు తేల్చిచెప్పారు. రైతుల ఆందోళనతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.