రక్తహీనతతో గుంటూరు జిల్లాలో ఎంతోమంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో 6-19 మధ్య వయస్సు కలిగిన బాలబాలికలతో పాటు 20-49 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఎవరైనా రక్తహీనత(ఎనీమియా)తో బాధపడుతుంటే, దాన్ని అధిగమించేలా చేయడమే లక్ష్యంగా తలపెట్టిన ఎనీమియా ముక్త్‌భారత్(ఏఎంబీ) జిల్లాలో ప్రహసనంలా మారింది. బాధితులను గుర్తించడంలో కీలకమైన ఇంటింటా సర్వే జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఇప్పటికే సర్వే నిర్వహణకు విధించుకున్న నిర్దేశిత గడువు ముగిసినా జిల్లాలో 50 శాతం ఇళ్లల్లో కూడా సర్వే కాలేదు. నవంబరు 25 వరకు కేవలం 45.7 శాతం నివాసాల్లోనే సర్వే పూర్తయింది. ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న కీలకమైన సర్వేను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ విస్మరించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే సర్వే నిర్వహణలో జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది.
జిల్లాలోని ప్రతి గ్రామ, పట్టణంలో ఉన్న ప్రతి ఇంటిని సర్వేలో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సందర్శించి తొలుత ఆ ఇంట్లో ఉన్న బాల, బాలికలు, మహిళల్లో రక్తహీనత శాతం ఎంత ఉందో తెలుసుకోవాలి. అందుకు సంబంధించిన హిమోగ్లోబిన్ మీటర్లను జిల్లాకు పంపారు. 16.50 లక్షల రక్తహీనత స్ట్రిప్స్ జిల్లాకు వచ్చాయి. ప్రతి ఏఎన్‌ఎంకు హిమోగ్లోబిన్ శాతం తెలుసుకోవటానికి అందుకు సంబంధించిన మీటర్ ఒకటి చొప్పున అందజేశారు. రక్తహీనతతో బాధపడే వారితో పాటు ఆ కుటుంబంలో మిగిలిన కుటుంబ సభ్యులు ఇంకేమైనా వ్యాధులతో బాధపడుతున్నారా అనే వివరాలు సేకరించి ఆ సమాచారాన్ని ఎన్‌సీడీ-సీడీ-ఏఎంబీ యాప్‌లో అప్‌లోడ్ చేసేలా ఈ సర్వేకు ప్రభుత్వం ఆదేశిస్తే రెండు మాసాలు కావొస్తున్నా సర్వే జిల్లాలో ఆశించిన విధంగా సాగడం లేదని వైద్య, ఆరోగ్య ఉన్నతాధికారులే ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేయటం గమనార్హం.
ఇదీ పరిస్థితి..