ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రికెట్‌ స్టేడియానికి రాజకీయ గ్రహణం - ఏపీ స్టేడియానికి రాజకీయ గ్రహణం

Mangalagiri Cricket Stadium: ఆంధ్రా క్రికెట్‌ అడ్రస్‌నూ మార్చేశారు.. మూడేళ్లలో మొత్తం ముంచేశారు.. రాజధాని అమరావతికి రాజసంగా నిలవాల్సిన అంతర్జాతీయ క్రికెట్‌ మైదానాన్ని ఉత్త రాతి కట్టడంగా మిగిల్చేశారు. 2019లో ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన చేయగానే.. ఏసీఏ ప్రధాన కేంద్రాన్ని విశాఖకు మార్చేశారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏసీఏ ప్రధాన కేంద్రం అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఆవరణలో ఉండాలన్నదే అందుకు కారణమని చెప్పారు. మరి 70 ఏళ్ల నుంచి ఈ నిబంధన అమలు చేయలేదా? పోనీ 2019 సెప్టెంబరులో ఏసీఏ పగ్గాలను చేపట్టిన వాళ్లు.. వెంటనే మంగళగిరి స్టేడియంలో మిగిలిన పనులు చేపడితే సరిగ్గా 10 నెలలు, ఏడాదిలో పూర్తయ్యేది. అప్పుడు తరలించాల్సిన అవసరం ఉండేది కాదని విమర్శలు వస్తున్నాయి.

క్రికెట్‌ స్టేడియానికి రాజకీయ గ్రహణం
Mangalagiri Cricket Stadium

By

Published : Nov 22, 2022, 3:24 PM IST

Mangalagiri Cricket Stadium in AP: మూడేళ్లలో మొత్తం ముంచేశారు. రాజధాని అమరావతికి రాజసంగా నిలవాల్సిన అంతర్జాతీయ క్రికెట్‌ మైదానాన్ని ఉత్త రాతి కట్టడంగా మిగిల్చేశారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికవ్వాల్సిన మైదానాన్ని అడవిలా మార్చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతున్న ఈ మైదాన పనులను పూర్తి చేయకుండా రాజకీయ కారణాలతో వదిలేశారు. వైకాపా అధికారంలోకొచ్చిన తొలి నాళ్లలోనే ఆ పార్టీ ముఖ్య నేత ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. దీంతో మైదానం పనులు త్వరితగతిన పూర్తయి అమరావతికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని క్రీడాభిమానులు ఆశించారు. కానీ ఆ ఆశలపై ఏసీఏ పెద్దలు నీళ్లు చల్లారు. మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం పనులు మూడేళ్లుగా ముందుకు కదలట్లేదు.

నిధులున్నా.. నిబద్ధత లేకనే:ఇప్పటికే స్టేడియంలో రూ.70 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగిలింది దాదాపు రూ.40-50 కోట్ల పనులే. 2019 నుంచి బీసీసీఐ నుంచి ఏసీఏకి నిధులొస్తున్నాయి. తగినన్ని నిధులున్నాయని ఏసీఏ వర్గాలు చెబుతున్నాయి. నిధులు, అనుమతులూ ఉన్నా.. కొద్దిపాటి పనులను పూర్తి చేయకపోవడానికి నిబద్ధత లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. మైదానం నిర్మాణం పూర్తయితే దానికయ్యే ఖర్చులో సగం ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సబ్సిడీ’ కింద బీసీసీఐ ఏసీఏకి తిరిగి చెల్లిస్తుంది. ఇన్ని వెసులుబాట్లు ఉన్నా స్టేడియం పనులు ముందుకు కదలకపోవడానికి రాజకీయ కారణాలు తప్ప మరేమీ లేవు.

దారీ తెన్నూ లేదు:రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేడియానికి ఎలాంటి మద్దతూ లభించలేదు. మంగళగిరి బస్టాండు నుంచి క్రికెట్‌ మైదానానికి ప్రధాన రహదారి నిర్మించాలి. దారిలో ఉన్న రైల్వే ట్రాక్‌ పైనుంచి వంతెన ఏర్పాటు చేయిస్తామని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. కానీ, ఇప్పటివరకూ ఎలాంటి అడుగులూ పడలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వమూ దానిపై దృష్టి సారించలేదు.

రాజసంగా నిలిచేది.. అభివృద్ధీ జరిగేది:2019-20లోనే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించే లక్ష్యంతో అంతకుముందు పనులు చేపట్టారు. కానీ, ఇప్పటివరకూ రంజీ మ్యాచ్‌కూ ఆతిథ్యమివ్వలేదు. రంజీ మ్యాచ్‌లను నిర్వహిస్తేనే బీసీసీఐ కౌన్సిల్‌ మైదానాన్ని పరిశీలించి అంతర్జాతీయ స్థాయి ఉందా లేదా అనేది తేలుస్తుంది. అలా జరిగితే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, రంజీలు, అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు వేదికగా మారేది. మ్యాచ్‌లు జరిగితే ఆతిథ్య రంగానికి డిమాండు పెరిగేది. స్టేడియం పూర్తయితే.. దాదాపు రూ.300 కోట్ల ఆస్తి అవుతుందని ఏసీఏ వర్గాలే చెబుతున్నాయి.

ప్రత్యేకతలతో..: ఈ మైదానంలో కొన్ని ప్రత్యేక వసతులను కల్పిస్తున్నారు. మ్యాచ్‌ మధ్యలో వర్షం కురిస్తే అది ఆగిన గంటలోపే మ్యాచ్‌ను పునరుద్ధరించేలా మైదానంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇండోర్‌ నెట్స్‌నీ ఏర్పాటు చేశారు. 34వేల సామర్థ్యంతో గ్యాలరీలను ఏర్పాటు చేశారు. భారత మహిళా క్రికెట్‌కూ ఏసీఏనే ప్రధాన కేంద్రం. అందుకే భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ గతంలో ప్రపంచ కప్‌నకు వెళ్లినప్పుడు ఇక్కడి నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసేది.

పెండింగ్‌ పనులివీ..

* డ్రెస్సింగ్‌ రూమ్స్‌ (ఇప్పుడు రెండు మూడు సిద్ధం చేస్తున్నారు)

* గ్యాలరీలన్నింటిలోనూ సీటింగ్‌ ఏర్పాట్లు

* ఫ్లడ్‌ లైట్లు

* ఏసీ ఏర్పాట్లు

* కార్పొరేట్‌ బాక్సులు

* నీటి సరఫరా

* లోపలివైపు విద్యుదీకరణ పనులు

* మైదానం బయటవైపు డ్రైనేజీ, చుట్టూ ప్రహరీ ఇవేగాక పెయింటింగ్‌ లాంటి ఇతర పనులూ చేయాలి.

బీసీసీఐకి పట్టదా?:ఇన్ని కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చుచేసి చేపట్టిన స్టేడియాన్ని సకాలంలో పూర్తి చేయకుండా వదిలేస్తే.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పట్టించుకోదా అన్న విమర్శలొస్తున్నాయి. ఏటా బీసీసీఐ తన ఆదాయంలో 60శాతాన్ని అన్ని రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలకు కేటాయిస్తోంది. ఆ నిధులను ఎలా వినియోగిస్తున్నారనే దానిపై బీసీసీఐ నియంత్రించదా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details