గుంటూరు జిల్లా నరసరావుపేటలో నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి బావిలో శవమయ్యాడు. గత శనివారం రాత్రి ఫోన్ రావటంతో బయటకు వెళ్లిన వ్యక్తి.. తిరిగి ఇంటికి రాలేదు. తాపీ మేస్త్రిగా పని చేస్తున్న వెంకటగిరి రెండు రోజులైన రాకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం జొన్నలగడ్డ గ్రామ శివారులో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల వెనుక బావిలో శవమై ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయించి, పరిశీలించారు. దుండగులు హత్య చేసి మృతదేహానికి తాడు కట్టి ద్విచక్ర వాహనంతో కొంతదూరం ఈడ్చుకు వెళ్లి అనంతరం వాహనంతో సహా బావిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం తీవ్రమైన దుర్వాసన రావటంతో ఘటన గత నాలుగురోజులు క్రితమే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.