ఇన్నాళ్లూ తిండి పెట్టిన నగరాలు కష్టం రాగానే వారిని వదిలేశాయి. భరోసా ఇవ్వాల్సిన వారు అండగా నిలవలేదు. పనులు లేవు.. తిండీ తిప్పల సంగతి పక్కనపెడితే... చంటి పిల్లలను పోషించలేని దిక్కుతోచని స్థితి వారిది. ఉన్న ఊరు కాదంది. కన్న ఊరికి వెళ్లిపోదామనుకుంటే అవకాశాలు లేవు. ఇక కాళ్లను నమ్ముకుని.... వేల కిలోమీటర్ల నడకకు సిద్ధమయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల మంది. ఏ ప్రధాన రహదారిపై చూసినా.... పిల్లా జల్లాతో తరలివెళ్తున్న వలస కార్మికుల వేదనే దర్శనమిస్తోంది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై కాజా టోల్‌గేట్ వద్దకు చేరుకున్న వలస కూలీలను ఈటీవీ భారత్ -ఈనాడు బృందం పలకరించగా వారి గోడు వెళ్లబోసుకున్నారు..
ప్రాణాలు కడగట్టుకుపోతున్నా బతుకుపై ఆశతో తరలి వెళుతున్న వలస కార్మికుల దయనీయ పరిస్థితిని ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ప్రతినిధులు పరిశీలించారు. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజ టోల్ గేట్ వద్ద... 24 గంటల పాటు ఆ మార్గంలో వెళ్లిన వలస కార్మికులను పలకరించారు. 24 గంటల వ్యవధిలో సుమారు 1100 మందికిపైగా వలస కార్మికులు వెళ్లారు. లారీ డ్రైవర్లను బతిమాలుకుని, వాటిలో ఎక్కి వెళ్లినవారు దీనికి అదనం. ఇలా తరలిపోతున్నవారిలో 80 శాతంపైగా కాలి నడకనే వెళుతున్నారు. ఈ మహా ప్రస్థానం ఎప్పటికి ముగుస్తుందో తెలీక ముందుకి సాగుతూనే ఉన్నారు.