పత్తి ఆధారిత నూలు మిల్లులకు రాష్ట్రం పెట్టింది పేరు. రాష్ట్రవ్యాప్తంగా 128 స్పిన్నింగ్ మిల్లులుండంగా....వీటి వార్షిక టర్నోవర్ 13 వేల కోట్లు. ఉత్పత్తి చేసే నిల్వల్లో 50 శాతానికి పైగా ఎగుమతి వాటా ఉండగా... అందులోనూ 80 శాతం చైనాకు ఎగుమతి అవుతుంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలూ నూలు కొంటాయి. లాక్డౌన్ ప్రభావంతో వస్త్రఉత్పత్తి నిలిచిపోవడంతో దారానికి గిరాకీ తగ్గింది. ఎగుమతులు, దేశీయ వినియోగం తగ్గిపోవడంతో ఎదురీదుతున్న స్పిన్నింగ్ పరిశ్రమకు లాక్డౌన్ వల్ల కూలీల కొరత తోడైంది.
లాక్డౌన్ సడలింపులతో మిల్లులు తెరుచుకున్నా... 30-40 శాతం సామర్థ్యంతోనే నడుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర కిలోలకు పైగా దారపు నిల్వలు పేరుకుపోయాయి. డిమాండ్ లేక నూలు ధరలు తగ్గాయి. కరోనా ముందు 40 కౌంట్ నూలు ధర రూ.215 ఉంటే ప్రస్తుతం రూ.180కి పడిపోయింది. ఒక్కో మిల్లులోనూ 50 వేల కిలోల నుంచి 4 లక్షల కిలోల వరకు దారపు నిల్వలు స్తంభించిపోయాయి. ముడిసరకును 6నెలల ముందే నిల్వ చేసుకుంటారు. తయారీ నిల్వలు స్తంభించడంతో వడ్డీల భారంతో పరిశ్రమల యజమానులు, నిర్వాహకులు ఎదురీదుతున్నారు. కూలీల కొరత వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గగా...ఉన్న కార్మికులు, కూలీల జీతాలు, మార్చి నుంచి విద్యుత్ బిల్లుల బకాయిలు మోయలేని భారంగా మారాయని నిర్వాహకులు వాపోతున్నారు. లాక్డౌన్ వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.