Jagananna Vasathi Devena: పావలా కోడికి ముప్పావలా మసాలా ఎవరైనా వేస్తారా. మన సీఎం జగన్ ప్రతీ సభలో వేస్తోంది అదే. అత్తెసరు సాయానికి అదిరిపోయే ప్రచారం చేసుకుంటున్నారు. జగనన్న వసతి దీవెన కింద విద్యార్థులకు వాస్తవంగా అయ్యే ఖర్చులో సగం నిధులైనా ఇవ్వకుండా, పూర్తిగా భరాయిస్తున్నామంటూ డప్పేసుకుంటున్నారు. ఏమూలకూ చాలని వసతి దీవెన నిధులు సకాలంలో ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులపై భారం పడుతోంది.
నిజాలు పరిశీలిస్తేగానీ జగనన్న గొప్పలు, విద్యార్థుల తిప్పలు అర్థంకావు. వసతి ఖర్చులో సగానికి సగం కూడా ఇవ్వని జగన్, పూర్తిగా భరాయిస్తున్నట్లు కటింగ్ ఇస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో హాస్టల్‌కు ఏడాదికి 70వేలు, సాధారణ డిగ్రీ కళాశాలల్లో40వేల నుంచి50 వేల వరకూ వసతి ఖర్చుల కింద వసూలు చేస్తున్నారు.
కానీ, జగన్ ఇస్తోంది కేవలం 20వేల రూపాయలే. మరి మిగతా 50 వేల రూపాయలు పిల్లలకు భారం కాదా. ఐటీఐ విద్యార్థులకు 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేల రూపాయల్ని ప్రభుత్వం వసతిదీవెన కింద ఇస్తోంది. అసలు 10 నుంచి 15 వేల రూపాయలకు ఏడాదంతా వసతి ఇచ్చే విద్యాసంస్థ ఒక్కటైనా ఉందా. మూడు, నాలుగు నెలల ఖర్చులకు సరిపోవడమే గొప్ప. కానీ, జగన్ మాత్రం పూర్తి వసతి ఖర్చులు ఇస్తున్నామంటూ మభ్యపెడుతున్నారు.
ఇచ్చేదే అరకొర దీవెన. అదీ రెండు విడతల్లో. పోనీ అదైనా సకాలంలో ఇస్తారా అంటే అదీ లేదు. కరోనా సమయంలో వసతి గృహాలు మూసేశారంటూ ఆ సమయంలో వసతి దీవెనను ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఆ తర్వాతి నుంచి ఒక విడత ఇస్తే మరో విడత ఇవ్వడం లేదు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో విడత వసతి దీవెనే ఇంతవరకూ ఇవ్వలేదు. ఏడాది గడిచిపోయింది. కళాశాల యాజమాన్యాలు ఇక మేం ఆగలేమంటూ పేద పిల్లల నుంచి ఎప్పుడో వసూలు చేసుకున్నాయి. గతేడాది వసతి దీవెనకే గతిలేకపోతే, ఇక ఈ ఏడాది ఇంకే ఇస్తారంటూ, తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకుంటున్నారు.
విద్యార్థుల ఓట్ల కోసం జగన్నాటకం - ప్రభుత్వ సాయం ప్రత్యక్షంగా తెలియాలనే ఉమ్మడి ఖాతా