ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు పక్కనే ఉన్న వైఎస్ విగ్రహాం కనిపించలేదా? : ఇప్పటం గ్రామస్థులు

Ippatam Village: జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పొలాలు ఇచ్చినందుకే ఇప్పటంలోని ఓ సామాజికవర్గంపై.. జగన్‌ కక్షగట్టారని ఇళ్ల కూల్చివేత బాధితులు ఆరోపించారు. అందుకే కొందరినే లక్ష్యంగా చేసుకుని ఇళ్లు, ప్రహరీలు పడగొట్టారని చెబుతున్నారు. రహదారి విస్తరణంటే ఊరి మధ్యలో నుంచి ప్రారంభిస్తారా? అని ప్రశ్నించిన గ్రామస్థులు, మూడున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని నిలదీశారు.

Ippatam Village
ఇప్పటం గ్రామస్థులు

By

Published : Nov 5, 2022, 9:06 PM IST

కూల్చివేతలపై ఇప్పటం గ్రామస్థుల స్పందన
Ippatam Village questioned ysrcp government: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల తొలగింపు వ్యవహారం.. తీవ్ర వివాదాస్పదం అవుతోంది. గ్రామంలో ఉన్న రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తామంటూ, మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు శుక్రవారం 53 ఇళ్లు, ప్రహరీలను ఉన్న పళంగా జేసీబీలతో కూలగొట్టారు. అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులను పక్కకులాగేసీ మరీ తొలగింపులు చేపట్టారు. దీనిపై గ్రామస్థులు తీవ్రంగా మండిపడ్డారు. కనీసం పల్లెవెలుగు బస్సులు కూడా రాని తమ గ్రామంలో 120 అడుగుల రోడ్డు ఇప్పటికిప్పుడు నిర్మించటం ఏంటని ప్రశ్నించారు.

తమ గ్రామం పక్కనే ఉన్న వడ్డేశ్వరం, వడ్లమూడి గ్రామాల నుంచి జాతీయ రహదారికి వెళ్లేందుకు అత్యంత ఇరుకైన రోడ్డు ఉందని, దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు. తమ గ్రామంలో ఇప్పటికే 90 అడుగుల మేర రహదారి ఉందని, అది భవిష్యత్‌ అవసరాలకు సరిపోతుందని అంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఇప్పటికే 40లక్షల ఖర్చుతో నిర్మించిన మురుగు కాలవ సైతం రహదారికి హద్దుగా ఉందని వివరించారు. కేవలం ఓ పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇవ్వడం వల్లే కక్షపూరితంగా అక్రమణల పేరిట తమ ఇళ్లు తొలగించారని గ్రామస్థులు ఆక్షేపిస్తున్నారు.

గ్రామంలో ఓ సామాజిక వర్గానికి చెందిన ఇళ్లను మాత్రమే తొలగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్‌ అధికారులకు రోడ్డు పక్కనే ఉన్న మాజీ ముఖ్యమంత్రివైఎస్ విగ్రహం కనిపించలేదా? అని గ్రామస్థులు ప్రశ్నించారు. వాటిని అలాగే ఉంచేసి తమ ఇళ్లను తొలగించడం వివక్ష కాక మరేంటని నిలదీస్తున్నారు. ఇళ్లు కూల్చివేసిన కుటుంబాలను కాంగ్రెస్‌ పార్టీ నేతలు పరామర్శించారు. వైకాపా కక్షపూరిత వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్న హస్తం నేతలు.. బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details