Ilavaram ZPHS English Teacher Hari Krishna: దేశం మెచ్చే విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు.. నాసా శాస్త్రవేత్తలతో మాటలు Ilavaram ZPHS English Teacher Hari Krishna: విద్యకు, విజ్ఞానానికి హద్దులు, సరిహద్దులు లేవు. నేర్చుకోవాలనే తపన ఉండాలే గానీ అవకాశాలు అనేకం. అందివచ్చిన సాంకేతికతను వారధిగా మలుచుకుని గ్రామీణ విద్యార్థుల్లోని బెరుకు, బిడియం దూరం చేసేందుకు వినూత్న కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లా ఐలవరం ఉన్నత ప్రభుత్వ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు హరికృష్ణ శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాష, భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్ని పెంపొందించేందుకు స్కైప్, జూమ్ మాధ్యమాల ద్వారా వివిధ దేశాల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఉన్న సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఆన్ లైన్ సమావేశాల ద్వారా ఐలవరం పాఠశాల విద్యార్థులు విదేశీ విద్యా నిపుణులతో వివిధ అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు. వివిధ దేశాల సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ప్రభుత్వాల పనితీరు, విద్య, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుంటున్నారు. విభిన్న రంగాల నిపుణులతో తరచూ మాట్లాడటం వల్ల.. ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తున్నారు. ఆంగ్ల వ్యాకరణం, ఉచ్ఛారణలో మెళకువలు నేర్చుకుంటున్నారని హరికృష్ణ తెలిపారు. చక్కని ప్రతిభ చూపే నిరుపేద విద్యార్థులకు విదేశీయులు ఆర్ధిక సాయం కూడా చేస్తున్నారని వెల్లడించారు.
National Best Teacher Uma Gandhi : ఆటపాటలే బోధనాభ్యసన మార్గాలు.. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఉమాగాంధీ
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విధులు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలతోనూ విద్యార్థులు మాట్లాడేందుకు హరికృష్ణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తనకు సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన శాస్త్రవేత్త హెడ్రీ ట్రూప్ సాయంతో నాసా శాస్త్రవేత్తలతో విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా సమావేశం నిర్వహిస్తున్నారు. నాసా చేపట్టే ప్రాజెక్టులు, చేసే పరిశోధనలు తదితర అంశాల గురించి తమ అనుభవాలను శాస్త్రవేత్తలు.. విద్యార్థులతో పంచుకుంటున్నారు.
"ప్రపంచంలోని విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, అనేక మంది సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో, మా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వారితో మాట్లాడటం వలన అతి తక్కువ కాలంలోనే మా విద్యార్థుల కమ్యునికేషన్ స్కిల్స్ పెరిగాయి. అదే విధంగా స్టేజ్ ఫియర్ పోయింది. నాసాలో పనిచేసే స్పేస్ ఎక్స్పర్ట్స్ ద్వారా.. మా విద్యార్థులు స్వేస సైన్స్‌ను అర్థం చేసుకుంటున్నారు. దీని కారణంగా వీరు భవిష్యత్తులో ఇస్రో, నాసాలో పనిచేసే అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు". - హరికృష్ణ, ఆంగ్ల ఉపాధ్యాయుడు, ఐలవరం జడ్పీ పాఠశాల
Mekala Bhaskar Rao selected as National Best Teacher: విధిని ఎదిరించి.. అంగవైకల్యం అడ్డుకాదని నమ్మి.. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక
పాఠశాల విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల్ని, భావ వ్యక్తీకరణను మెరుగుపరిచేందుకు పెన్ పాల్స్ అనే మరో అరుదైన కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు.. విదేశీ విద్యార్థులకు లేఖలు రాస్తున్నారు. విదేశీ విద్యార్థులతో ఉత్తర, ప్రత్యుత్తరాల వల్ల పిల్లల ఆలోచనా విధానంలో గుణాత్మక మార్పులు వచ్చాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. హరికృష్ణ చొరవతో అనేక దేశాల విద్యార్థులతో మన విద్యార్థులకు స్నేహబంధం కొనసాగుతుందని తెలిపారు. పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తున్నారని.. భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"ఏ పాఠశాలలో లేని విధంగా 40 - 50 దేశాల పిల్లలతో మా విద్యార్థులు ఇంటరాక్ట్ అవుతున్నారు. వారితో సంభాషించడం, లెటర్ల ద్వారా వారితో మాట్లాడటం వలన.. రైటింగ్, రీడింగ్, స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి. దీని వలన మా పాఠశాలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది". - మోహన్ రావు, ప్రధానోపాధ్యాయుడు, ఐలవరం
ఈ టీచరమ్మ చేస్తున్న సేవకు.. జేజేలు పలకాల్సిందే..!